National

మరో నోటీసు.. రూ. 1,745 కోట్లు కట్టాలని కాంగ్రెస్‌కు ఐటీ సమన్లు..

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్డీఏ కూటమిని ఓడించేందుకు ఇండియా కూటమి వ్యూహాలు రచిస్తోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీని బీజేపీ ప్రభుత్వం కష్టాల ఊబిలోకి నెట్టేలా చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి తాజాగా ఐటీ శాఖ మరోసారి నోటీసులు జారీ చేసింది. 1,745 కోట్లు కట్టాలని సూచిస్తూ మరోసారి సమన్లు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇప్పటికే(రెండ్రోజుల క్రితం) రూ. 1,823 కోట్లు చెల్లించాలని కోరుతూ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి వేల కోట్లు చెల్లించాలంటూ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

 

2014-15, 2016-17 సంవత్సరాలకు సంబంధించి రూ. 1,745 కోట్లు చెల్లించాలని ఐటీ శాఖ తమకు నోటీసులు జారీ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి. మొత్తం రూ. 3,567 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఈ మొత్తాన్ని చెల్లించాలని కోరుతూ మరో నోటీసులు ఇచ్చినట్లు తెలిపింది.

 

2017-18, 2020-21 సంవత్సరాలకు సంబంధించి వడ్డీతో సహా రూ. 1823 కోట్లు చెల్లించాలని ఐటీ శాఖ స్పష్టం చేసింది. అయితే ఐటీ శాఖ నోటీసులను సవాలు చేస్తూ కాంగ్రెస్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఐటీ శాఖ చేపట్టిన ఈ విధానాన్ని నిలిపివేయాలని కోరుతూ కాంగ్రెస్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన మరుసటి రోజే నోటీసులు రావడం గమనార్హం. ఈ ప్రక్రియ కోసం అవసరమైన ఆధారాలు తమ వద్ద ఉన్నట్లు ఐటీ శాఖ స్పష్టం చేసింది. దీంతో ఈ విషయంతో జోక్యం చేసుకోలేమని కోర్టు తెలిపింది.

 

ఢిల్లీ హైకోర్టు పిటిషన్ తిరస్కరించడంతో కాంగ్రెస్ సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల వేళ నిధుల కొరత ఏర్పడిందని ఇప్పటికే హైకోర్టులో దాఖలు చేసిన తన పిటిషన్‌లో కాంగ్రెస్ పేర్కొంది. ఈ మేరకు రేపు అత్యున్నత న్యాయస్థాన్ని ఆశ్రయించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.