AP

సీఎం జగన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి మరో లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రాష్ట్రంలో కురుస్తున్న ఆకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని లేఖలో పేర్కొన్నారు.. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. కొన్ని చోట్ల ప్రాణనష్టం కూడా జరిగింది. పలు జిల్లాల్లో వాణిజ్య పంటలతో పాటు ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పశువుల కూడా చనిపోయాయి అని లేఖలో పేర్కొన్న ఆయన.. జంగారెడ్డిగూడెంలోని తాడువాయి గ్రామానికి మెట్ల సంధ్య, కలిగిరి మండలం అనంతపురం గ్రామానికి చెందిన శ్రీవిద్య (38) భారీ వర్షాలకు, పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయారన్నారు.. వర్షాల కారణంగా మిర్చి, మినుములు, జొన్నలు, అరటి, బొప్పాయి, మామిడి, టమాట, వరి తదితర పంటలు భారీగా దెబ్బతిన్నాయని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

 

శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లో ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోళ్ల జాప్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని లేఖలో పేర్కొన్నారు చంద్రబాబు.. పల్నాడు, ప్రకాశం, ఎన్టీఆర్, కర్నూలు, ఏలూరు, అనంతపురం, అల్లూరి సీతారామరాజు, కడప జిల్లాల్లో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయారన్న ఆయన.. అకాల వర్షాల వల్ల తీవ్ర నష్టం ఉన్నా వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే అభిప్రాయం ఉందని.. ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులను ఆదుకోవడం చాలా ముఖ్యం అన్నారు. వర్షాల కారణంగా మరణించిన బాధితుల కుటుంబ సభ్యులకు ఎక్స్ గ్రేషియా అందజేయాలని కోరారు. ఇక, హార్టికల్చర్, వాణిజ్య పంటల నష్టాన్ని తక్షణమే అంచనా వేయాలి. వర్షపు నీటిలో తడిసిన వరిధాన్యాన్ని కనీస మద్దతు ధర (MSP) చెల్లించి తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. పంట రుణాల తక్షణ పునరుద్ధరణ చేపట్టాలి.. బాధిత రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలి. వడగండ్ల వాన కారణంగా దెబ్బతిన్న ఆస్తికి పరిహారం చెల్లించాలని తన లేఖలో సీఎం వైఎస్‌ జగన్‌కు కోరారు చంద్రబాబు.