National

ఎన్నికల వేళ.. ఈసీ కీలక నివేదిక విడుదల..

దేశంలో ఎన్నికల సందడి నెలకొంది. రెండు నెలల్లో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉంది. మార్చిలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. మే చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది.

 

ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మంగా తీసుకుంటోన్నాయి అన్ని పార్టీలు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ.. ఈ సారి గద్దెనెక్కడానికి ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. దీనికి అనుగుణంగా వ్యూహ, ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి.

 

ఈ పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ తాజా నివేదిక విడుదల చేసింది. దేశంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో తెలియజేసే పూర్తిస్థాయి నివేదిక ఇది. దేశంలో ఎంతమందికి ఓటు హక్కు ఉందనే విషయాన్ని వెల్లడించింది ఈసీ. కొత్తగా ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకున్న వారి వివరాలు కూడా ఇందులో ఉన్నాయి.

 

మొత్తంగా 96,88,21,926 మంది ప్రజలకు ఓటు హక్కు ఉన్నట్లు ఈసీ తెలిపింది. 2019 నాటి సార్వత్రిక ఎన్నికలతో పోల్చుకుంటే ఈ సంఖ్యలో ఆరు శాతం పెరుగుదల కనిపించింది. 2019లో దేశంలో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య 89.6 కోట్లు. ఈ అయిదేళ్లల్లో ఈ సంఖ్య 96.88 కోట్లకు చేరుకుంది.

 

ఇందులో పురుష ఓటర్లు 49.7 కోట్ల వరకు ఉన్నారు. మహిళా ఓటర్ల సంఖ్య 47.1 కోట్లు. జెండర్ రేషియో 940 నుంచి 948కి చేరుకుంది. అంటే ప్రతి వెయ్యిమంది పురుష ఓటర్లకు 948 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ట్రాన్స్‌జెండర్ల ఓట్ల సంఖ్య ఈ అయిదేళ్లల్లో 39,683 నుంచి 48,044కు పెరిగింది.

 

18 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఓటర్లు 1,16,48,090 మంది ఉన్నారు. 20 నుంచి 29 వరకు వయస్సు గల ఓటర్లు 17,81,14,233 మంది ఉన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో వారందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని ఆశిస్తున్నట్లు ఈసీ తెలిపింది.