TELANGANA

కేసీఆర్ సొంత నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు భారీ షాక్..!

తెలంగాణా రాష్ట్రంలో గతంలో రెండు పర్యాయాలు పాలన సాగించిన బీఆర్ఎస్ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలైంది. ఇక తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సీఎంగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టి దూకుడుగా పాలన సాగిస్తున్నారు. ఇక ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నుండి చాలా మంది రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారు.

 

ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోగా, తాజాగా మాజీ సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం అయిన గజ్వేల్ లో కూడా బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. ఇప్పటికే వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి రేవంత్ రెడ్డిని కలిశారు. త్వరలో బీఆర్ఎస్ కు షాక్ ఇస్తున్నట్టు, కాంగ్రెస్ లో చేరుతున్నట్టు చెప్తున్నారు.

l

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు చేరుతున్నారని, చాలామంది చేరికలకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది. తాజాగా . కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, పార్లమెంటు ఎన్నికల్లోపే వారంతా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు.

 

మరోవైపు, పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు, బీఆర్ఎస్ నేత వెంకటేశ్ నేత ఆ పార్టీకి షాక్ ఇచ్చి కాంగ్రెస్ లో చేరాడు. తాజాగా కేసీఆర్ నియోజకవర్గం అయిన గజ్వేల్ లో కూడా గులాబీ బాస్ కు షాక్ తగిలింది. తూప్రాన్ మున్సిపాలిటీలో ఏడుగురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. వారంతా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

 

అంతేకాదు మున్సిపల్ చైర్మన్ వ్యవహార శైలిపై, బీఆర్ఎస్ చైర్మన్ హయాంలో మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై వారంతా తీవ్ర ఆరోపణలు చేశారు. ఒకపక్క కేసీఆర్ పార్టీ శ్రేణులను ఏకతాటిపై నడిపించే ప్రయత్నం చేస్తుంటే మరోవైపు ఒక్కొక్కరుగా జారిపోతున్నారు. గులాబీ బాస్ కు వరుస షాకులిస్తున్నారు.