ఏపీలో ఎన్నికల వేళ ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల్లో గెలుపు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. సీఎం జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైనా బీజేపీ తుది నిర్ణయం కోసం వేచి చూస్తోంది. ఇప్పటికే ఎన్డీఏలోకి టీడీపీ రీ ఎంట్రీ దాదాపు ఖాయమైనా…అధికారిక నిర్ణయం పైన సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ సమయంలోనే ప్రధాని మోదీ ఏపీలో పర్యటించనున్నారు. కీలక నిర్ణయం దిశగా అడుగులు పడుతున్నాయి.
ఏపీకి ప్రధాని మోదీ: ఏపీలో ఇప్పుడు ఎన్నికల పొత్తులు రాజకీయ ఉత్కంఠ పెంచుతున్నాయి. జగన్ ను ఓడించాలనే లక్ష్యంతో టీడీపీ, జనసేన పొత్తు ఖాయం చేసుకున్నాయి. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ కల్యాణ్ తమ రెండు పార్టీలతో బీజేపీ కలిసి రావాలని చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశమయ్యారు.
ఎన్డీఏలోకి టీడీపీ తిరిగి చేయటం దాదాపు ఖాయమైందనే వార్తలు వచ్చాయి. మూడు పార్టీల మధ్య సీట్ల సర్దబాటు పైన చర్చలు జరిగాయి. కానీ, పొత్తు పైన ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. దీంతో, మూడు పార్టీల్లోనూ పొత్తుల పైన సస్పెన్స్ నెలకొంది. ఈ సమయంలోనే ప్రధాని మోదీ ఏపీ పర్యటనకు వస్తున్నారు.
పొత్తుల లెక్కలు: ఈ నెల 28న ప్రధాని మోదీ విశాఖ పర్యటన పైన అధికారులకు సమాచారం అందింది. హెచ్ పీ సీఎల్ ప్లాంట్ ప్రారంభోత్సవంతో పాటుగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొంటారని సమాచారం. ప్రధాని తో పాటుగా సీఎం జగన్ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. గత వారం ఢిల్లీలో అమిత్ షా తో చంద్రబాబు భేటీ తరువాత ప్రధాని మోదీతో సీఎం జగన్ సమావేశం కావటం రాజకీయంగా ఆసక్తి కర చర్చకు కారణమైంది.
దీనికి కొనసాగింపుగా పొత్తుల పైన బీజేపీ వైఖరి పైన స్పష్టత రాకపోవటంతో మరింత డైలమా కొనసాగుతోంది. వచ్చే వారం బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు పైన ప్రకటన ఉంటుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఇంకా తేల్చకపోతే ముందుకే వెళ్లే ఆలోచనలో చంద్రబాబు, పవన్ ఉన్నారని సమాచారం. ఇక, ప్రధాని పర్యటన వేళ కీలక నిర్ణయాలు ఉంటాయని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు.
బీజేపీ వ్యూహాం: విశాఖ కేంద్రంగా ప్రధాని పర్యటన సమయంలో స్టీల్ ప్లాంట్ ప్రయివేటకరణ అంశంలో ప్రకటన ఉంటుందనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణలో ఎన్నికల ప్రచారం వేళ పసుపు బోర్డు గురించి ప్రకటన చేసినట్లుగానే స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ విషయంలో కార్మికులు, స్థానికుల అభిప్రాయాలకు అనుగుణంగా నిర్ణయం ఉంటుందని భావిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా 400 సీట్లు లక్ష్యంగా బీజేపీ పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఏపీలో పోటీ చేసే స్థానాల్లో విశాఖ పైన బీజేపీ తొలి నుంచి ఫోకస్ చేసింది. కేంద్ర పథకాల్లో విశాఖకు ప్రాధాన్యత ఇచ్చింది. ఇక..ఏపీలో ఎన్నికల రాజకీయం హోరా హోరీగా మారిన సమయంలో ప్రధాని మోదీ విశాఖ పర్యటన..చేసే ప్రకటనల పైన రాజకీయంగా ఉత్కంఠ పెరుగుతోంది.