Uncategorized

కేసీఆర్ ఎందుకు బయపడుతున్నారు? అసెంబ్లీకి రావాలి: ‘మేడిగడ్డ’పై రేవంత్ కీలక వ్యాఖ్యలు..

కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ. లక్ష కోట్లు ఖర్చు పెట్టినా.. లక్ష ఎకరాలకు కూడా నీరు అందలేదని సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న ఏడో బ్లాక్‌లోని పియర్స్‌ను సీఎం రేవంత్‌రెడ్డి తోపాటు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, తుమ్మల నాగేశ్వరారవుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం పార్టీ సభ్యులు పరిశీలించారు.

 

అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు స్థితిగతులపై ఇంఛార్జీ చీఫ్ ఇంజినీర్ సుధాకర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గత అక్టోబర్ 21న మేడిగడ్డ పిల్లర్లు కుంగాయని ఇంజినీర్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. లక్ష ఎకరాలకు నీరు అందకపోయినా.. కేసీఆర్ మాత్రం కోటి ఎకరాలకు నీరు ఇచ్చామని గొప్పలు చెప్పారని విమర్శించారు.

 

 

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతా లోపం ఉందని డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పినప్పటికీ.. సమస్యను చక్కదిద్దే పనిచేయకుండా నిర్లక్ష్యం చేశారని కేసీఆర్‌పై మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏటా విద్యుత్ బిల్లులే రూ. 10,500 కోట్లు వస్తున్నాయని సీఎం రేవంత్ తెలిపారు. ప్రాజెక్టు రుణాలు, ఇతర ఖర్చులు కలిపి ఏటా రూ. 25వేల కోట్లు అవసరమవుతాయన్నారు. కుంగిన మేడిగడ్డను ఎవరూ చూడకుండా కేసీఆర్ కప్పిపుచ్చారని ధ్వజమెత్తారు. ఈసీ అనుమతి పొంది రాహుల్ గాంధీ, తాను మేడిగడ్డను పరిశీలించినట్లు తెలిపారు.

 

ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై నీటి పారుదల శాఖ మంత్రి విచారణకు ఆదేశించారని సీఎం రేవంత్ చెప్పారు. కాళేశ్వరం నిర్మాణం, నిర్వహణలో భారీగా లోపాలు ఉన్నాయని విజిలెన్స్ కమిటీ చెప్పిందన్నారు. రీడిజైన్ పేరుతో కాళేశ్వరం చేపట్టి భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తన బండారం బయటపడుతుందని కేసీఆర్ గ్రహించారన్నారు. అవినీతి బయటపడకుండా ప్రజల దృష్టి మరల్చేందుకే నల్గొండ సభ పెట్టారని రేవంత్ ఆరోపించారు. ప్రజలు రెండుసార్లు అధికారమిస్తే.. ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నారని అన్నారు.

 

కాళేశ్వరంపై ప్రజల అనుమానాలు నివృత్తి చేయాలని భావించామని, అందుకే శాసనసభ, ప్రజాకోర్టులో చర్చిద్దామని ఆహ్వానించామని రేవంత్ తెలిపారు. కాలు విరిగిందని శాసనసభకు రాలేని కేసీఆర్.. నల్గొండ సభకు ఎలా వెళ్లారని ప్రశ్నించారు. కేసీఆర్ దోపిడీకి కాళేశ్వరం బలైపోయిందన్నారు. అడిగితే సలహాలు ఇస్తానన్న కేసీఆర్.. కేఆర్ఎంబీపై చర్చ పెడితే అసెంబ్లీకి ఎందుకు రాలేదని రేవంత్ నిలదీశారు. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించింది కేసీఆరేనని అన్నారు. సాగునీటి శాఖపై అసెంబ్లీలో శ్వేతపత్రం పెడతామని.. కేసీఆర్ వచ్చి మాట్లాడాలన్నారు.

 

కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు వచ్చేందుకు కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు రేవంత్. రూ. వేల కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు కుంగితే చిన్న విషయంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టిన ఏ బ్యారేజీలోనూ ఇప్పుడు నీరు లేదని, మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీల్లో ఒకే తరహా సమస్య ఉందని రేవంత్తెలిపారు. ప్రస్తుతం సీపేజీ చేసి అన్నారం, సుందిళ్లలో సమస్యను కప్పిపుచ్చారని తెలిపారు. వానాకాలం నీరు వస్తే, సుందిళ్ల, అన్నారంలో కూడా సమస్యలు బయటడపడతాయని వ్యాఖ్యానించారు. ప్రజల కోసం బయటికి వెళ్లే అలవాటు కేసీఆర్‌కు ఏనాడూ లేదన్నారు. ఎంపీ ఎన్నికల్లో కొన్ని ఓట్లు తెచ్చుకునేందుకు కొత్త ఎత్తుగడ ఎత్తుకున్నారని రేవంత్ విమర్శించారు.