TELANGANA

తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌నే సంపుతరా..? నన్ను సంపి మీరుంటరా..?

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు కయ్యానికి కాలు దువ్వాయి. ఢీ అంటే ఢీ అంటోన్నాయి. నదీ జలాల అంశాలపై పరస్పరం సమరానికి సంసిద్ధం అయ్యాయి.

 

ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి.. గేరు మార్చింది. అధికార కాంగ్రెస్ పార్టీపై యుద్ధానికి దిగింది. కృష్ణా జలాల పంపిణీ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తోన్న విధానాలకు నిరసనగా నల్గొండ గడ్డ మీద సమర శంఖారావాన్ని పూరించింది బీఆర్ఎస్.

 

బీఆర్ఎస్ బాస్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఇలా పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఇందులో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తరువాత బీఆర్ఎస్ నిర్వహించిన మొట్టమొదటి భారీ బహిరంగ సభ ఇదే కావడం, కేసీఆర్ దీనికి హాజరు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

 

ఈ సభలో కేసీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగారు. కృష్ణా జలాలను ఏపీ ప్రభుత్వం తరలించుకుపోయిందంటూ రేవంత్ రెడ్డి ఇదివరకు చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. ఉద్వేగ భరితంగా మాట్లాడారు. నదీ జలాలలతో పాటు పలు అంశాలను ప్రస్తావించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎండగట్టారు.

 

రైతుబంధు అడిగిన అన్నదాతలను చెప్పుతో కొట్టాలంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై భగ్గుమన్నారు కేసీఆర్. ఈ మాట అనడానికి ఎన్ని గుండెల్రా మీకు..కండ కావరమా? కండ్లు నెత్తికొచ్చినయా? అంటూ నిప్పులు చెరిగారు. రైతులకు కూడా చెప్పులు ఉంటాయని, అవి ఇంకా గట్టిగా, బందొబస్తుగా ఉంటాయని, ఒకటే దెబ్బకు మూడు మూతి పండ్లు రాలిపోతాయని ధ్వజమెత్తారు.

 

ఛలో నల్గొండ అంటూ పిలుపునిచ్చిన తనను ఇక్కడ దిగనివ్వం అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ తప్పుపట్టారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌నే తిరగనియ్యరా?, ఇంత మొగోళ్లా?, ఏం జేస్తరు? సంపేస్తరా? దా? కేసీఆర్‌ను సంపుతరా? కేసీఆర్‌ను సంపి మీరుంటరా? అంటూ సవాల్ విసిరారు.

 

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో కూడా ఛలో నల్గొండ ఆందోళనకు పిలుపునిచ్చామని కేసీఆర్ గుర్తు చేశారు. తనకు చేతనైనా, కాకపోయినా.. కట్టె కాలేవరకూ తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస వరకూ పులిలాగా కొట్లాడుతానే తప్ప పిల్లిలాగా పండుకోను అని తేల్చి చెప్పారు.

 

కృష్ణా జలాలు లేకపోవడం వల్లే నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య పీడించిందని కేసీఆర్ గుర్తు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాతే ఈ ప్రాంతాన్ని ఫ్లోరైడ్ రహిత జిల్లాగా మార్చామని అన్నారు. భవిష్యత్తులో ఉవ్వెత్తిన ఎగిసిన ఉద్యమంలా పోరాడకపోతే.. మనల్ని మనం కాపాడుకోలేమని కేసీఆర్ హెచ్చరించారు.

 

ఎన్నికలు ఉన్నప్పుడు వచ్చి నంగనాచి కబుర్లు చెప్తారని, ఆ తరువాత పట్టించుకోరని కేసీఆర్ అన్నారు. ఓటు గుద్దినం గడ్డకెక్కినం అంటే మన వీపున గుద్ది బొందలో నూకుతరే తప్ప ఎవ్వడూ రాడని తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య గురించి మాట్లాడటానికే ఛలో నల్గొండ సభ పెట్టినామని అన్నారు.