ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న తాజా పరిస్థితిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు వ్యవహారంపై తనదైన శైలిలో స్పందించారు. ఏపీకి ప్రత్యేకహోదాపై కేంద్రాన్ని ప్రశ్నించడానికి గతంలో చంద్రబాబు భయపడ్డారని.. ఇప్పుడు జగన్ కూడా భయపడ్డారని అన్నారు. కేసుల భయంతోనే వాళ్లు వెనుకంజ వేశారని విమర్శించారు.
రాక్షసుడ్ని, దుర్మార్గుడ్ని అయినా భరించవచ్చు కానీ, పిరికివాడ్ని భరించే పరిస్థితి ఉండకూడదని అన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఎన్నికల సమయంలో నోటాకు ఓట్లు పడకపోవడానికి కారణాలు ఉన్నాయి. ప్రజలు ఎవరు తక్కువ అవినీతిపరుడో చూసుకుని వారికి ఓటేస్తున్నారు తప్ప.. నోటా జోలికి వెళ్లడంలేదని చెప్పుకొచ్చారు.
మార్కెట్లో టమాటాలన్నీ పుచ్చులే ఉన్నప్పుడు వాటిలో కాస్త తక్కువ పుచ్చులున్న వాటినే ఏరుకుంటాం… ఇదీ అంతేనని అన్నారు. ఎన్నికలు మానేయమంటే ప్రజలు మానేస్తారా? టమాటాల విషయంలోనే కాదు, ఇది అన్నింటికీ వర్తిస్తుందని ఉండవల్లి వ్యాఖ్యానించారు. ఇతను కేంద్రాన్ని అడగడానికి భయమండీ అంటుంటే ఇంకేమనాలి?.. చంద్రబాబు మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన ఐదేళ్లూ అడగడానికి భయపడ్డాడని.. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి మీద కూడా కేసులు ఉన్నాయి కాబట్టి అడగడానికి భయపడుతున్నాడని అంటున్నారన్నారు.
కేసులు లేకుండా ఎవరున్నారు? అని ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశ్నించారు. ప్రపంచంలోకెల్లా నేనే నిజాయతీపరుడ్ని అని చెప్పే కేజ్రీవాల్ మీద కూడా కేసు పెట్టేశారు. ఢిల్లీలో ప్రైవేటు స్కూళ్లలో ఎవరు చేరకుండా, అందరూ ప్రభుత్వ స్కూళ్లలోనే చేరే పరిస్థితి తెచ్చిన సిసోడియాను కూడా జైల్లో వేసేశారు. సిసోడియా జైలుకెళ్లి సంవత్సరం అవుతోంది… అతడ్ని బయటికి రానివ్వరు. ఇలా అందర్నీ ఏరతారు… దీని వల్ల నష్టమేంటి? అని ప్రశ్నించారు.
‘జైలుకెళితే ఓడిపోతాననడం అర్థరహితం. జైలుకు వెళ్లిన ప్రతివాడు గెలుస్తున్నాడు. రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లాడు… రాగానే గెలిచాడు. జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్లాడు.. గెలిచాడు. ఇవాళ చంద్రబాబు కూడా జైలుకు వెళ్లాడు. అందరూ అదే అంటున్నారు… చంద్రబాబు కూడా జైలుకు వెళ్లాడు, గెలుస్తాడు అంటున్నారు’ అని ఉండవల్లి తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. పార్లమెంటు తలుపులు మూసి, ఎంతో రగడ చేసి రాష్ట్ర విభజన చట్టం తయారుచేశారు. ఆ చట్టాన్నే అమలు చేయడానికి తిరగబడమంటున్నామన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్.