కేంద్ర ప్రభుత్వంతో నాలుగో విడత చర్చలు విఫలమైన క్రమంలో రైతులు ఢిల్లీ చలోకు యత్నించారు. దీంతో పంజాబ్-హర్యానా సరిహద్దు తీవ్ర ఉద్రిక్తంగా మారింది. ఖనౌరీ సరిహద్దు వద్ద భద్రతా బలగాల చేతిలో ఒకరైతు మరణించినట్లు రైతులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ చలోను రెండు రోజుల పాటు నిలుపుదల చేస్తున్నట్లు పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ అధినేత శర్వణ్ సింగ్వెల్లడించారు.
కాగా, అంతకుముందు గురువారం ఉదయం మరోసారి ఢిల్లీ చలో నిరసనకు యత్నించారు. ఈ నేపథ్యంలో పంజాబ్, హరియాణా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శంభు, ఖనౌరీ సరిహద్దుల్లో ట్రాక్టర్ ట్రాలీలు, మినీ వ్యాన్లు, పికప్ ట్రక్కుల్లో వేలాదిగా మోహరించిన రైతులు ముందుకు కదిలేందుకు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రైతులను నిలువరించేందుకు పోలీసులు భాష్ఫవాయు గోళాలు ప్రయోగించారు. ఈ ఘటనలో ఓ యువరైతు మరణించాడు.
హర్యానాలో భద్రతా దళాల చేతిలో ఓ రైతు మరణించినట్లు రైతు సంఘాల నేతలు వెల్లడించారు. ఖనౌరీ ప్రాంతంలో భద్రతా సిబ్బందికి నిరసన తెలుపుతున్న రైతులకు మధ్య జరిగిన ఘర్షణలో 21 ఏళ్ల రైతు మరణించగా మరికొంత మంది గాయపడినట్లు రైతు సంఘాల నేతలు తెలిపారు.
ఫిబ్రవరి 13న ఢిల్లీ చలో మార్చ్ ప్రారంభమైనప్పటి నుంచి జరిగిన ఘర్షణల్లో ఇదే తొలి మరణమని తెలిపారు. మరణించిన రైతును పంజాబ్‌లోని భటిండా జిల్లాలోని బలోకే గ్రామానికి చెందిన సుభకరన్ సింగ్‌గా గుర్తించినట్లు రైతు నాయకుడు బల్దేవ్ సింగ్ సిర్సా తెలిపారు. ఘర్షణలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారని, వీరిలో ఒకరు మరణించారని పాటియాలా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ తెలిపారు. కాగా, రైతులు పంట వ్యర్థాలు, ఎండుగడ్డితో మంటలు పెడుతూ వాటిలో మిర్చి పౌడర్ వేస్తున్నారని, దీంతో తీవ్ర శ్వాస సంబంధమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని పోలీసులు చెబుతున్నారు.
ఇది ఇలావుండగా, రైతు సంఘాలు ఇచ్చిన ఢిల్లీ చలో కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఐదోసారి చర్చలకు రావాలని రైతు సంఘాలను ఆహ్వానించింది. మరోవైపు, ఢిల్లీ చలోతో అప్రమత్తమైన ప్రభుత్వం ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించింది. రైతులు, వారి వాహనాలు ఢిల్లీలోకి ప్రవేశించకుండా ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ, హర్యానాలోని రెండు సరిహద్దు ప్రాంతాలైన టిక్రీ, సింఘూను కాంక్రీట్‌తో చేసిన బారికేడ్లు, ఇనుప మేకులతో మూసివేసింది. పోలీసు, పారా మిలిటరీ బలగాలను భారీగా మోహరించటం ద్వారా సరిహద్దులను దాదాపు మూసివేశారు. మరోవైపు, జాతీయ రహదారులపైకి ట్రాక్టర్లతో ఆందోళన చేపట్టవద్దని హైకోర్టు కూడా సూచించింది.