TELANGANA

జనసంద్రంగా మేడారం.. మహాజాతర ప్రారంభం..

మేడారం జనసంద్రంగా మారింది. ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నారు. నేడు, రేపు కూడా భారీగా భక్తులు తరలొచ్చే అవకాశం ఉంది. దీంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నేడు సారలమ్మ గద్దె మీదకు రానున్నారు. గిరిజన పూజారులు కన్నెపల్లి నుంచి సారలమ్మను, పూనగొండ్ల నుంచి పగిడిద్దరాజును గద్దెలపైకి తీసుకురానున్నారు. మేడారానికి ఇప్పటికే 15 లక్షల మంది భక్తులు వచ్చినట్లు తెలుస్తోంది.

 

బుధ, గురువారం ఈ సంఖ్య మరింత పెరగనుంది. ఈ రోజు సాయంత్రం కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం వద్ద గిరిజనలు పూజులు చేసి సారలమ్మను గద్దె పైకి తీసుకరానున్నారు. సారలమ్మ పూజారి కాక సారయ్య మొంటె(వెదురుబుట్ట)లో అమ్మవారి ప్రతిరూపమైన పసుపు, కుంకుమలను భరిణె రూపంలో తీసుకుని కాలినడకన మేడారానికి వెళ్లనున్నారు.

 

గురువారం సమ్మక్క గద్దెలపైకి రానున్నారు. అమ్మవార్ల దర్శనం అనంతరం 4వ రోజు సాయంత్రం ఆదివాసి పూజారులు గద్దెలపై ఉన్న అమ్మవార్లకు ఆహవాన పలుకుతారు. ఆ తర్వాత వనదేవతలు వనప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది. ప్రభుత్వ లాంఛనాలతో ఈ వేడుక నిర్వహించనున్నారు. మేడారం అమ్మవార్ల దర్శనం కోసం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం రానున్నారు.

 

గతంలో కూడా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మేడారం అమ్మవార్ల దర్శనానికి వచ్చారు. కానీ సరైన ప్రోటోకాల్ కల్పించలేదు. ఇది అప్పట్లో చర్చనీయంశం అయింది. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2022లో మేడారం వచ్చి వనదేవతలను దర్శించుకున్నారు. ఇప్పుడు సీఎం హోదాలో రాబోతున్నారు. అయితే కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు గతంలో మేడారంలో రాలేదు. దీనిపై కూడా చాలా విమర్శలు వచ్చాయి.