సంచలనం రేపిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్ రాష్ట్ర సమితి సీనియర్ నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత.. ఈ కేసులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఆమె చుట్టూ సీబీఐ ఉచ్చు పన్నినట్టే కనిపిస్తోంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ అధికారులు కవితకు ఇదివరకే సమన్లను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 26వ తేదీన విచారణకు రావాల్సి ఉంటుందంటూ ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు తాజాగా కవిత పేరును ఛార్జ్షీట్లో పొందుపరిచినట్లు సమాచారం.
ఈ కేసులో కవితను నిందితురాలిగా సీబీఐ అధికారులు గుర్తించినట్లు చెబుతున్నారు. నిందితురాలిగా పేర్కొంటూ సీబీఐ అధికారులు ఆమెకు తాజాగా నోటీసులనూ జారీ చేశారని సమాచారం. ఈ క్రమంలో తప్పనిసరిగా ఈ నెల 26వ తేదీ నాటి విచారణకు కవిత హాజరు కావాల్సి ఉంటుంది.
ఇదే ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో ఇదివరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా కవితకు సమన్లను జారీ చేశారు గానీ ఆమె విచారణకు హాజరు కాలేదు. అంతకుముందే ఈ కేసులో రెండుసార్లు ఆమె ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయానికి వెళ్లొచ్చారు. విచారణకు హాజరయ్యారు.
తాజాగా ఈ కేసులో సీబీఐ జోక్యం చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. లోక్సభ ఎన్నికలను ఎదుర్కొనడానికి బీఆర్ఎస్ సిద్ధమౌతున్న ప్రస్తుత పరిస్థితుల్లో- సీబీఐ అధికారులు కవితకు సమన్లు ఇవ్వడం అటు రాజకీయంగా కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో లేదు.
ఈ పరిస్థితుల్లో కవిత.. సీబీఐ నుంచి సమన్లను అందుకోవడం చర్చనీయాంశమౌతోంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్, ఎంపీ సంజయ్ సింగ్.. విచారణను ఎదుర్కొంటోన్నారు. జైలు జీవితాన్ని గడుపుతోన్నారు.