ఏపీలో ఎన్నికల వేళ అమరావతి రాజధాని వ్యవహారం మరోసారి తెరపైకి వస్తోంది. ఇక్కడ రైతులకు గతంలో టీడీపీ ప్రభుత్వం కేటాయించిన ప్లాట్లను రద్దు చేసేందుకు వీలుగా రైతులకు సీఆర్డీయే ఇచ్చిన నోటీసులు కలకలం రేపాయి. వీటిపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రైతులకు ఇవాళ ఊరట లభించింది. ఈ నోటీసుల్ని రద్దు చేస్తూ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో గతంలో కేటాయించిన విధంగా యథాతథంగా వారికి ఈ ప్లాట్లు కొనసాగుతాయి.
గతంలో భూసమీకరణ కింద రాజధాని కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతులకు అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్లాట్లు కేటాయించింది. వీటిని రద్దు చేస్తూ మొత్తం 862 మందికి సీఆర్డీయే కమిషనర్ నోటీసులు జారీ చేశారు. దీన్ని సవాల్ చేస్తూ సదరు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. సీఆర్డీయే చట్టం కింద భూసమీకరణలో ఇచ్చిన ఫ్లాట్లను రద్దు చేయడంపై వాదనలు జరిగాయి. ఈ ప్లాట్ల రద్దు సీఆర్డీయే చట్టానికి విరుద్దమని న్యాయవాది ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపించారు. అసలు సీఆర్డీయే మాస్టర్ ప్లాన్ కు విరుద్దంగా కమిషనర్ ఈ నోటీసులు జారీ చేశారని వాదించారు.
అయితే ప్రభుత్వం మాత్రం సీఆర్డీయే చట్టంలో మార్పులు చేశామని, కాబట్టి ఈ నోటీసులు చెల్లుతాయని వాదించింది. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు .. సీఆర్డీయే కమిషనర్ రైతులకు ఫ్లాట్లు రద్దు చేస్తూ ఇచ్చిన నోటీసుల్ని రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. దీంతో రైతులకు భారీ ఊరట దక్కినట్లయింది. ఇప్పటికే రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఫ్లాట్ల కేటాయింపు సక్రమంగా లేకపోవడంతో పాటు వారికి కౌలు కూడా దక్కడం లేదు. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు వారికి భారీ ఊరటగా భావించవచ్చు.