AP

టీడీపీలోకి వివేకా కుమార్తె సునీత – ముహూర్తం, పోటీ స్థానం ఖరారు..!

ఏపీలో ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్ వివేకా హత్య తరువాత పులివెందుల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కొంత కాలంగా సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్న వివేకా కుమార్తె సునీత రాజకీయ ప్రకటనకు సిద్దమయ్యారు. ఇందుకు ముహూర్తం ఖరారు చేసారు. వచ్చే ఎన్నికల్లో పోటీ ఖాయంగా కనిపిస్తోంది. దీంతో, ఇప్పుడు సునీత పొలిటికల్ ఎంట్రీతో కడప జిల్లాలో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.

 

సునీత రాజకీయ నిర్ణయం : వివేకా కుమార్తె సునీత రాజకీయ ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ చేసారు. ఈ నెల 15న వైఎస్ వివేకా అయిదో వర్దంతి. అదే రోజున పులివెందుల వేదికగా రాజకీయ ప్రకటన చేయాలని డిసైడ్ అయ్యారు. వివేకా హత్య తరువాత చోటు చేసుకున్న వరుస పరిణామాలు..ఇప్పుడు ఎన్నికల వేళ కొత్త రాజకీయ సమీకరణాలకు కారణంగా నిలుస్తున్నాయి. ఇప్పటికే సునీత వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి పైన వివేకా హత్య కేసులో పలు ఆరోపణలు చేసారు. అవినాశ్ పైన న్యాయ పోరాటం చేస్తున్నారు. తాజాగా ఢిల్లీలో మీడియా సమావేశంలోనూ వచ్చే ఎన్నికల్లో తన సోదరులకు ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు. వివేకా తల్లి వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి కడప ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది.

 

టీడీపీ, కాంగ్రెస్ లో ఎటు వైపు : ఇదే సమయంలో సునీత రాజకీయంగా ప్రకటన చేసేందుకు సిద్దం అయ్యారు. షర్మిల కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా ఉండటంతో కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. అయితే, సునీతకు తొలి నుంచి చంద్రబాబు అండ్ కో మద్దతుగా నిలుస్తున్నారు. తన తండ్రిని హత్య చేసిన వారిని శిక్షించాలంటూ పోరాటం చేస్తున్న సునీతకు మద్దతుగా నిలవాలని చంద్రబాబు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. జగన్ కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో అంగీకరిస్తేనే సునీత, లేదా సౌభాగ్యమ్య తమ పార్టీ నుంచి పోటీలో దించాలని భావిస్తున్నారు. ఈ దిశగా మంతనాలు సాగుతున్నట్లు సమాచారం. అటు షర్మిల ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేది కీలకంగా మారనుంది. ఈ సమయంలో సునీత రాజకీయ ప్రకటన కడప రాజకీయాల్లో ఉత్కంఠ పెంచుతోంది.

ఎన్నికల్లో పోటీ దిశగా : ఈ నెల 15న కడపలో సునీత, ఆమె భర్త రాజశేఖర రెడ్డి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో వైసీపీకి వ్యతిరేకంగా తమ రాజకీయ నిర్ణయం గురించి ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే, టీడీపీకి మద్దతుగా నిలిచినా సునీత నేరుగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదని భావిస్తున్నారు. సౌభాగ్యమ్మ పోటీలో ఉంటారని చెబుతున్నారు. అయితే, టీడీపీ అధినాయకత్వం మాత్రం సునీతను పోటీ చేయాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. దీంతో..తమ మద్దతుదారులతో సమావేశమై తుది నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది. టీడీపీలోనే చేరుతారా..లేక, షర్మిలతో కలిసి రాజకీయ పోరాటం సాగించేందుకు కాంగ్రెస్ లో చేరుతారా అనేది స్పష్టత రావాల్సి ఉందని మద్దతు దారులు చెబుతున్నారు. దీంతో, ఈ నెల 15న సునీత చేయబోయే రాజకీయ ప్రకటన పైన ఆసక్తి నెలకొంది.