AP

అమిత్ షా వద్ద చంద్రబాబును ఫిక్స్ చేసిన సీబీఐ మాజీ జేడీ ..

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీతో తన పొత్తు ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు. టీడీపీ-జనసేన కూటమిలో బీజేపీనీ చేర్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు సాగిస్తోన్నారు.

 

అటు జనసేన సైతం ఇదే కోరుకుంటోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కొనలేమంటూ ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఎప్పుడో తేల్చేశారు. బీజేపీతో మితృత్వం కొనసాగిస్తూనే.. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఉమ్మడిగా వైఎస్ఆర్సీపీని ఎదుర్కొనబోతోన్నారు.

 

ఇప్పుడీ రెండు పార్టీల మధ్య పొత్తుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. బీజేపీతో సీట్ల పంపకాల వ్యవహారంపై చంద్రబాబు ఎట్టకేలకు తెరదించారని సమాచారం. జనసేన- బీజేపీతో కలిసి తెలుగుదేశం పార్టీ మహాకూటమిని ఏర్పాటు చేయడం దాదాపుగా ఖాయమైందని చెబుతున్నారు.

 

ఇందులో భాగంగా- చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఢిల్లీ వెళ్లిన విషయం తెలిసిందే. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిశారు. సీట్ల పంపకాలపైనా చర్చించారు. పొత్తుపై నేడో రేపో ఈ మూడు పార్టీల అధినేతలు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది.

 

చంద్రబాబు- అమిత్ షా భేటీపై సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని డిమాండ్లను చంద్రబాబు ముందు ఉంచారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు ముందడుగు వేయాలని అన్నారు. దీనికి ఇదే సరైన సమయంగా అభిప్రాయపడ్డారు.

 

ఎంతో కాలంగా ఎదురు చూస్తూ వస్తోన్న ఏపీకి ప్రత్యేక హోదా కల్పించడంపై అమిత్ షా నుంచి లిఖితపూరక హామీని తీసుకోవాలని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఏపీకి 10 సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా కల్పిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరచడం, హోదా ఇస్తామంటూ 2014 ఎన్నికల ప్రచార సమయంలో తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభ సాక్షిగా నరేంద్ర మోదీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

 

వాటిని జేడీ లక్ష్మీనారాయణ గుర్తు చేశారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం- 2014లోని హామీలను నెరవేర్చడం, విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరిస్తామనే ప్రతిపాదనలను ఉపసంహరించుకోవడం, వైజాగ్ రైల్వే జోన్ కేటాయింపును హేతుబద్ధీకరించడం వంటి హామీలపై లిఖితపూరక హామీని తీసుకోవాలని చంద్రబాబుకు సూచించారు.

 

బీజేపీతో పొత్తు, సీట్ల పంపకాలు, ఎన్డీఏ కూటమిలో చేరిక ఖరారు కావడానికి ముందే అమిత్ షా నుంచి రాతపూర్వక హామీని తీసుకోవాలని లక్ష్మీనారాయణ అన్నారు. ఈ హామీ పత్రాన్ని చంద్రబాబు- రాష్ట్ర ప్రజలందరికీ చూపించాలని చెప్పారు. ఆ తరువాతే పొత్తులపై ముందడుగు వేయాలని సూచించారు.