National

ఈ ముసుగు వ్యక్తి ఆచూకీ తెలిపిన వారికి రూ.10 లక్షల నగదు

సంచలనం సృష్టించిన బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటన మరో మలుపు తీసుకుంది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడి కోసం గాలిస్తోన్న జాతీయ దర్యాప్తు సంస్థ.. కీలక ప్రకటన విడుదల చేసింది. అతని ఫొటోలను విడుదల చేసింది. ఆచూకీ తెలియజేసిన వారికి 10 లక్షల రూపాయల నగదు బహుమతిని అందజేస్తామని ప్రకటించింది.

 

బెంగళూరులోని ప్రఖ్యాత రామేశ్వరం కేఫ్‌లో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారంతా వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తొలుత సిలిండర్ పేలి ఉండొచ్చని అనుమానించారు. ఆ తరువాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

 

ఇంప్రువైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్‌ వల్లే ఈ ఘటన సంభవించినట్లు తేలింది. ఉగ్రవాద కోణం వెలుగులోకి వచ్చింది. పెద్ద ఎత్తున మారణహోమాన్ని సృష్టించాలనే ఉద్దేశంతోనే ఆగంతకులు ఈ ఘటనకు పాల్పడి ఉండొచ్చంటూ వార్తలొచ్చాయి. ఈ కోణంలోనే దర్యాప్తు మొదలుపెట్టారు.

 

కేఫ్ ఆవరణలో ఓ బ్యాగులో అమర్చిన ఐఈడీ ద్వారా పేలుడుకు పాల్పడినట్లు గుర్తించారు. దీనితో ఈ కేసు విచారణ ప్రక్రియను బెంగళూరు పోలీసులు.. జాతీయ దర్యాప్తు సంస్థకు బదలాయించారు. పేలుడు ముందు, ఆ తరువాత సీసీటీవీ కెమెరాలన్నింటినీ క్షుణ్నంగా పరిశీలించారు. వాటి ఆధారంగా కీలక సమాచారాన్ని సేకరించారు.

 

ఈ బ్యాగును తీసుకొచ్చిన యువకుడిని ప్రధాన నిందితుడిగా గుర్తించారు ఎన్ఐఏ అధికారులు. పేలుడుకు ముందు బ్యాగును తీసుకుని కేఫ్‌లోకి రావడం.. పేలుడుకు కొన్ని నిమిషాల ముందు కేఫ్ నుంచి బయటికి వెళ్లినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. దీనితో అతని కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు.

 

అతని గురించి సమాచారాన్ని అందించిన వారికి 10 లక్షల రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు ఎన్ఐఏ అధికారులు. వారి వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు. 080-29510900, 8904241100 నంబర్లకు సంప్రదించాలని లేదా ఇమెయిల్ info.blr.nia@gov.inకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.