దేశ రాజధాని ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవితను ఆమె భర్త అనిల్ తోపాటు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు ఆదివారం కలిశారు. కవిత అరెస్టును సవాల్ చేస్తూ అనిల్ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నట్లు సమాచారం. కాగా, ఢిల్లీ మద్యం కేసులో శుక్రవారం అరెస్ట్ అయిన కవితకు రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి మార్చి 23 వరకు ఈడీ కస్టడీ విధించిన విషయం తెలిసిందే.
కవిత తొలిరోజు విచారణ పూర్తి
ఢిల్లీ లిక్కర్ కేసులో రిమాండ్‌లో ఉన్న కవిత ఆదివారం తొలిసారిగా ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. కవితపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. కవిత వాటిలో కొన్నింటికి సమాధానాలు చెప్పగా.. మరికొన్ని ప్రశ్నలకు మౌనంగా ఉండిపోయారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చిన రూ. 100 కోట్లు ఎలా వచ్చాయని, లిక్కర్ పాలసీ ద్వారా సంపాదించిన రూ. 192 కోట్ల గురించి ఆధారాలు చూపించి అధికారులు కవితను ప్రశ్నలు అడిగారు.
కవిత కొనుగోలు చేసిన ఆస్తి పత్రాలు చూపించి ప్రశ్నించారు. ఇంకా ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారని ఈడీ అధికారులు ఆరా తీశారు. విచారణను ఈడీ అధికారులు వీడియో రికార్డు చేశారు. కాగా, విచారణ అనంతరం కవితను ఆమె భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, బావ హరీశ్ రావు కలిశారు. కవిత యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కేసులో న్యాయ పోరాటం చేద్దామని ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా న్యాయవాది మోహిత్ రావు కూడా కవితను కలిశారు. మరోవైపు, సోమవారం సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ కంటెంప్ట్ అఫిడవిట్ దాఖలు చేయనున్నారు. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ అఫిడవిట్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, శుక్రవారం కవితను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు శనివారం రౌస్ఎవెన్యూ కోర్టులో ఆమెను హాజరుపర్చారు. ఇరుపక్షాల వాదనల అనంతరం కోర్టు మార్చి 23 వరకు ఈడీ కస్టడీ విధించింది. అయితే, ఈడీ కస్టడీలో ఉన్న సమయంలో ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కుటుంబసభ్యులు, న్యాయవాదులు కలుసుకునే వెసులుబాటును కవితకు కోర్టు కల్పించింది.