AP

కేంద్రంలో బీజేపీ రావాలని ఏపీ ప్రజలు కోరుకుంటోన్నారు: మోదీ..

రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ.. ప్రతిపక్ష తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమికి తొలి బహిరంగ సభను నిర్వహిస్తోంది. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో ఈ సభ ఏర్పాటైంది. దీనికి ప్రజాగళం అని పేరు పెట్టారు.

 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. వేదికను పంచుకున్నారు. సుదీర్ఘ విరామం అనంతరం ఒకే వేదికపై ఈ ముగ్గురూ కనిపించారు. 2014 నాటి సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా టీడీపీ- బీజేపీ కూటమి కట్టిన విషయం తెలిసిందే.

 

ఈ సభను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. కేంద్రంలో మళ్లీ బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం రావాలని ఏపీ ప్రజలు కోరుకుంటోన్నారని అన్నారు. ఏపీ ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. కొందరు ఏపీ మంత్రులు అవినీతిపరులుగా మారారని విమర్శించారు. అవినీతి కార్యకలాపాల్లో పోటీ పడుతున్నారని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం తమను మోసం చేసిందని ప్రజలు భావిస్తున్నారని మోదీ చెప్పుకొచ్చారు.

 

అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన రోజున ఏపీ ప్రజలు సంబరాలు చేసుకున్నారని మోదీ గుర్తు చేశారు. తెలుగు ప్రజలు ఎన్టీఆర్‌ను ఎప్పటికీ మరిచిపోలేరని, రాముడు, కృష్ణుడి పాత్రకు ఆయన ప్రాణం పోశారని ప్రశంసించారు. రైతులు, పేదల హక్కుల కోసం ఎన్టీఆర్ జీవితాంతం పోరాడారని పేర్కొన్నారు.

 

కాంగ్రెస్ వల్ల అధికారాన్ని సైతం కోల్పోయారని, ప్రజల మద్దతుతో తిరిగి సాధించగలిగారని మోదీ చెప్పారు. కాంగ్రెస్ ఎప్పుడూ కూడా ఏపీని అవమానిస్తూనే వచ్చిందని ధ్వజమెత్తారు. తాము మాత్రం ఏపీని ఎప్పుడూ గౌరవిస్తామని, వారి నిర్ణయాలను స్వాగతిస్తామని మోదీ వ్యాఖ్యానించారు.

 

ఎన్నికల షెడ్యూల్ వెలువడిన రోజున తాను తెలుగు ప్రజల మధ్య ఉన్నానని, ఇక్కడి కోటప్పకొండలో కొలువైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల నుంచి తాను ఆశీస్సులు పొందుతున్నానని మోదీ చెప్పారు. త్రిమూర్తుల ఆశీస్సులతో కేంద్రంలో తాము మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మోదీ ధీమా వ్యక్తం చేశారు.