AP

సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. ఫ్యూచర్ సిటీగా విశాఖ..

నాలెడ్జ్ ఎకానమీకి విశాఖపట్నం ఫ్యూచర్ సిటీగా మారుతోందన్నారు సీఎం చంద్రబాబు. ఉత్తమ నగరాలలో ఒకటిగా నిలుస్తుందన్నారు. టెక్నాలజీతో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, నాలెడ్జ్ ఎకానమీలో యువత కీలకంగా మారారని అన్నారు.

 

విశాఖపట్నంలో నేషనల్‌ డీప్‌ టెక్‌ ఇన్నోవేషన్ కాంక్లేవ్‌‌కు హాజరయ్యారు. సదస్సును ప్రారంభించిన అనంతరం మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రపంచంలో ఎటు చూసినా టెక్నాలజీపై చర్చ జరుగుతోందన్నారు. దీని కారణంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. జీవితంలో అది కూడా ఓ భాగంగా మారిందన్నారు.

 

దేశం, విదేశాల్లో ఉన్న ఐటీ నిపుణుల్లో 30 శాతం తెలుగువారేనని గుర్తు చేశారు. ఐటీ గురించి ఎవరు మాట్లాడినా హైటెక్‌ సిటీ ప్రస్తావన వస్తుందన్నారు. అప్పట్లో ఐటీ రంగంలో అవకాశాలు అంది పుచ్చుకున్నామన్నారు. ఇప్పుడు డీప్ టెక్నాలజీ సరికొత్త ఆవిష్కరణ కేంద్రమైందన్నారు. దీన్ని అందుకోవడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందన్నారు.

 

ఏఐ సాయంతో మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా అడుగులు వేస్తామన్నారు. అంతేకాదు ఏపీని నాలెడ్జ్‌ హబ్‌గా మారుస్తామని మనసులోని మాట బయటపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ అభివృద్ధికి ఒక విజన్ ప్రకారం ముందుకు వెళ్లామన్నారు. పెట్టుబడులు దగ్గర నుంచి మానవ వనరుల వరకు అన్నీ ఒక విజన్ ప్రకారమే పని చేశామన్నారు.

 

ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్య విధానాలతో ప్రభుత్వం ముందుకెళ్తున్నట్లు వివరించారు సీఎం. టూరిజం సెక్టార్‌లో కొత్త విధానాలు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నామని, దీంతోపాటు డ్రోన్లు కీలకంగా మారిన విషయాన్ని నొక్కి వక్కానించారు. నదుల అనుసంధానంతో నీటి కొరత ఉందని, ఆహార ఉత్పత్తుల సరఫరాలో ఏపీ గ్లోబల్ హబ్‌గా మారుతోందన్నారు. ఏపీకి ఉన్న వనరుల్లో కీలకమైనది తీర ప్రాంతమని, పెట్టుబడులు పెట్టేవారికి అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు.