AP

పవన్ కల్యాణ్ పోటీపై నాగబాబు క్లారిటీ..!

ఏపీలో ఎన్నికల పోరు తారా స్థాయికి చేరింది. ఢిల్లీ కేంద్రంలో ఏపీలో పొత్తుల రాజకీయం కొనసాగుతోంది. చంద్రబాబు తిరిగి ఎన్డీఏలో చేరేలా అడుగులు వేస్తున్నారు. అటు జగన్ రేపు (శుక్రవారం) ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. టీడీపీ, జనసేన తో బీజేపీ పొత్తు ఖాయమైతే మరోసారి సీట్ల పంపిణీ పైన కసరత్తు చేయాల్సి ఉంటుంది. ఈ రెండు రోజుల్లోనే బీజేపీ తో పొత్తు వ్యహారం తేలిపోనుంది. ఇటు పవన్ కల్యాణ్ పోటీ చేసే స్థానం గురించి నాగబాబు కీలక వ్యాఖ్యలు చేసారు.

 

ఏపీలో వైసీపీ అభ్యర్దుల ఎంపిక కసరత్తు తుది దశకు చేరింది. టీడీపీ, జనసేన అధినేతలు తమ అభ్యర్దుల జాబితా పైన ఇప్పటికే చర్చలు చేసారు. సీట్ల షేరింగ్ పైన దాదాపు ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ సమయంలోనే బీజేపీతో పొత్తు అంశంపైన స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ, జనసేనకు 40 అసెంబ్లీ, 8 ఎంపీ స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారని చెబుతున్నారు. ఆ రెండు పార్టీల నుంచి 50 అసెంబ్లీ 10 ఎంపీ స్థానాలు కోరుతున్నట్లు తెలుస్తోంది. దీంతో, ఈ అంశం పైన చంద్రబాబు తన వైఖరి స్పష్టం చేసారు. ఇక..సీట్ల సర్దుబాటు – పవర్ షేరింగ్ పైన మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉంది. ఆ తరువాత టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పైన అధికారికంగా ప్రకటనకు ఛాన్స్ ఉందని చెబుతున్నారు.

 

ఇక, బీజేపీ తమ రెండు పార్టీలతో కలవటం పైన మెగా బ్రదర్ నాగబాబు స్పందించారు. టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ కలిసి వస్తుందని భావిస్తున్నామన్నారు. మరో పది రోజుల్లో జనసేన పోటీ చేసే అభ్యర్థులను..నియోజకవర్గాలను తమ అధినేత పవన్ ప్రకటిస్తారని స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉంది కాబట్టి..టీడీపీ నేత చింతకాయల విజయ్‌తో మర్యాద పూర్వకంగానే కలిశామని చెప్పారు. అనకాపల్లి ఎంపీ పోటీ అంశం చర్చకు రాలేదని, తాను ఎక్కడ నుంచి పోటీ చేయాలో తమ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని నాగబాబు స్పష్టం చేశారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేసే అవకాశం ఉందని నాగబాబు పేర్కొన్నారు. కంటెంట్ ఉన్నవాడికి కటౌట్ అవసరం లేదని చెప్పుకొచ్చారు.