AP

ప్రధానితో జగన్ భేటీ..

ఏపీలో రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. పొత్తుల లెక్కలు సమీకరణాలు మారుతున్నాయి. ఎన్డీఏలోకి టీడీపీ తిరిగి చేరటం దాదాపు ఖాయమైంది. అమిత్ షా తో చంద్రబాబు తాజా భేటీలో ఈ మేరకు చర్చ జరిగింది. కొన్ని ప్రతిపాదనల పైన తుది నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఈ సమయంలోనే ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ ఆసక్తి కరంగా మారింది. ఇటు ఢిల్లీకి వెళ్లే ముందు పవన్ కల్యాణ్ హైదరాబాద్ లో చంద్రబాబుతో సమావేశం కానున్నారు.

మారుతున్న లెక్కలు : ఏపీలో 2014 పొత్తులు తిరిగి రిపీట్ అవ్వటం లాంఛనంగానే కనిపిస్తోంది. కానీ, ఈ పొత్తుల లెక్కల్లో ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. చంద్రబాబు – అమిత్ షా భేటీలో పొత్తు పైన సానుకూలత వచ్చినా సీట్ల అంం పైన క్లారిటీ రాలేదని సమాచారం. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి 40 అసెంబ్లీ, 8 ఎంపీ స్థానాలను ఇచ్చేందుకు చంద్రబాబు సిద్దమైనట్లు తెలుస్తోంది. బీజేపీ నుంచి తమ రెండు పార్టీలకు 55-60 అసెంబ్లీ స్థానాలు 10-12 ఎంపీ సీట్లు ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినట్లు సమాచారం. అయితే, 9న బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చించి పొత్తుల పైన నిర్ణయం తీసుకుంటామని అమిత్ షా చెప్పినట్లు తెలుస్తోంది. ఇటు తన పార్టీ నేతలతో చర్చించి సీట్ల ప్రతిపాదన పైన మరోసారి కలుస్తానని చంద్రబాబు చెప్పినట్లుగా సమాచారం.

ప్రధానితో జగన్ భేటీ : ఈ సమయంలోనే అవసరమైతే మూడు పార్టీల నుంచి సీట్ల ఖరారు అంశం పైన ముగ్గురు నేతలతో ఒక కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు. ఢిల్లీకి రావాల్సిందిగా పవన్ కు పిలుపు రావటంతో ఈ రాత్రి లేదా రేపు ఉదయం ఆయన ఢిల్లీ వెళ్లే అవకాశం ఉంది. అటు సీఎం జగన్ ఢిల్లీ వెళ్తున్నారు. ఈ రాత్రికి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. రేపు ఉదయం ప్రధానితో సమావేశం కానున్నారు. అధికారిక టూర్ అని చెబుతున్నా..ఎన్నికల సమయం..పొత్త రాజకీయాల వేళ జగన్ పర్యటన పైన అనేక రకాలుగా చర్చ మొదలైంది. ఇప్పటి వరకు కేంద్రంలో పలు సందర్భాల్లో బీజేపీ ప్రభుత్వానికి బిల్లుల ఆమోదంలో జగన్ పార్టీ సహకరిస్తూ వచ్చింది. జగన్ అభ్యర్దనల పైన కేంద్రం నుంచి సానుకూలత కనిపించింది. ఇప్పుడు బీజేపీ ఏపీలో టీడీపీతో జత కట్టటం ఖాయంగా కనిపిస్తున్న వేళ జగన్ పర్యటనకు ప్రాధాన్యత పెరిగింది.

చంద్రబాబు – పవన్ భేటీ : ఈ పరిణామాలతో టీడీపీ, జనసేన అలర్ట్ అయ్యారు. చంద్రబాబుతో పవన్ సమావేశం కానున్నారు. అమిత్ షా తో చర్చల సారాంశాన్ని చంద్రబాబు వివరించనున్నారు. అదే విధంగా సీట్ల కోసం బీజేపీ నుంచి పెరుగుతున్న ఒత్తిడి గురించి చర్చించే అవకాశాలు ఉన్నాయి. 50 సీట్లు పొత్తుల్లో ఇస్తే పార్టీలో నేతలకు సమాధానం చెప్పలేని పరిస్థితి వస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో..సీట్ల పైన ముందుగా పవన్ తో చర్చించటం ద్వారా సర్దుబాటు వ్యవహారం పైన ఒక నిర్ణయానికి రావాలని భావిస్తున్నారు. చంద్రబాబుతో చర్చల తరువాత పవన్ ఢిల్లీ వెళ్లనున్నారు. సీట్ల గురించి తన అభిప్రాయం స్పష్టం చేసే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో జగన్ ఢిల్లీలో ప్రధాని భేటీ అంశాన్ని నిశితంగా గమనిస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తిగా మారుతున్నాయి.