TELANGANA

కేసీఆర్‌పై రేవంత్ వ్యంగ్యాస్త్రాలు..

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు తెలంగాణ ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేసీఆర్, బీఆర్ఎస్ గురించి ప్రజలు ఆలోచించడం మానేశారని అన్నారు. గవర్నర్ ప్రసంగానికి రాలేదంటేనే కేసీఆర్ బాధ్యత అర్థం అవుతోందని చెప్పుకొచ్చారు. కేసీఆర్ కాలం చెల్లిన ఔషధమంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు రావాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు సీఎం రేవంత్.

 

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project)పై విచారణకు సిట్టింగ్ జడ్జిని ఇవ్వలేమని హైకోర్టు చెప్పిందన్న రేవంత్ రెడ్డి.. విశ్రాంత జడ్జితో విచారణ జరిపించుకోవాలని చెప్పారని తెలిపారు. హైకోర్టు చెప్పిన అంశంపై మంత్రివర్గంలో లేదా అసెంబ్లీలో చర్చిస్తామన్నారు సీఎం రేవంత్.

 

 

కాగా, బీఏసీ సమావేశానికి కేసీఆర్ స్థానంలో హరీశ్ రావు(Harish Rao) వెళ్లడంపై సీఎం రేవంత్ స్పందించారు. బీఏసీ సమావేశానికి అందులోని సభ్యులే రావాలని స్పష్టం చేశారు. రేపు హిమాన్షు (కేటీఆర్ తనయుడు) కూడా వస్తానంటే ఎలా అని ఎద్దేవా చేశారు రేవంత్. ఐదేళ్లపాటు శాసనసభ వ్యవహారాల మంత్రిగా చేసిన హరీశ్ రావుకు ఆ మాత్రం అవగాహన లేదా? అని ప్రశ్నించారు.

 

తెలంగాణ ప్రతిపక్ష హోదా నేతకు గది కేటాయింపుపైనా రేవంత్ స్పందించారు. గది మార్పు స్పీకర్ నిర్ణయమని తెలిపారు. అసెంబ్లీలో కులగణన తీర్మానం ఉంటుందని, అంశాలు చర్చించాల్సిన అవసరం ఉందనుకుంటే సభాపతి సభ నిర్వహణ కాలం పొడిగించవచ్చని చెప్పారు. కేఆర్‌ఎంబీకి ప్రాజెక్టులను గత ప్రభుత్వం అప్పగించిందని ఆరోపించారు. సాగర్‌ను ఏపీ సీఎం జగన్ పోలీసులతో ఆక్రమించినా కేసీఆర్ ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. ఏపీ వాళ్ళు ప్రతి రోజు 12.5 టీఎంసీలను తీసుకెళ్తుంటే కేసీఆర్ అడ్డుకోలేదని మండిపడ్డారు.

 

బేసిన్‌లు లేవు భేషజాలు లేవని కేసీఆర్ అన్నారు. అక్కడే ఆయన కమిట్‌మెంట్ ఏంటో తెలిసిపోతోందన్నారు రేవంత్. తమ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉందన్నారు. ఆరు గ్యారంటీలు తప్పకుండా అమలు చేస్తామన్నారు సీఎం రేవంత్. త్వరలోనే మరో రెండు గ్యారంటీలు అమల్లోకి వస్తాయన్నారు. గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత కరెంట్, రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్ గ్యారంటీల అమలుపై తీవ్రంగా కసరత్తు చేస్తున్నామన్నారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు.

 

సీఎంగా నేను కేసీఆర్‌ను కూడా కలుస్తాను. విజయ్‌సాయి రెడ్డి నాన్ సీరియస్ పొలిటీషియన్. అలాంటి వాళ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. ‘కేసీఆర్ అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాను. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ చిత్తశుద్ధిని ప్రజలు చూశారు. కేసీఆర్‌ చిత్తశుద్ధిని గుర్తించి కృష్ణా పరివాహక ప్రజలు తీర్పు ఇచ్చారు. మిషన్ భగీరథపై విచారణకు ఆదేశించాం. ఉద్యోగ నియామకాల విషయంలో స్పష్టతతో ఉన్నాం. విధానపర లోపాలు లేకుండా పాలన సాగిస్తున్నాం. రాజ్యసభ ఎన్నికల్లో ఎంతమంది పోటీ చేసేది అధిష్ఠానం నిర్ణయిస్తుంది’ అని రేవంత్ తెలిపారు.