AP

ఏపీలో కూటమి సర్కార్ క్రిస్మస్ కానుక..!

ఏపీలో ఆరునెలల పాలన పూర్తి చేసుకుంటున్న కూటమి సర్కార్ క్రిస్మస్ కానుక ఇవ్వనున్నట్లు ప్రకటించింది. గతంలో టీడీపీ ప్రబుత్వం అధికారంలో ఉండగా వివిధ మతాలకు వారి మతాలకు అనుగుణంగా పండుగ వస్తువులను కానుకగా అందించేవారు ఇప్పుడు మరోసారి రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలో ఎన్డీయే సర్కార్ అధికారంలోకి రావడంతో క్రిస్మస్ కానుక అందించనున్నట్లు మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ప్రకటించారు.

 

రాష్ట్రంలో ఎస్సీ సంక్షేమ పథకాలన్నీ అర్హులైన వారికి అందిస్తామని, గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఎస్సీ సంక్షేమ పథకాలన్నింటినీ తిరిగి పునరుద్దరిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో ప్రారంభించిన కమ్యూనిటీ హాల్స్ ను జనరల్ నిధులతో పూర్తి చేసి ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గత ప్రభుత్వం కమిటీ హాల్స్ ను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించారని, రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్స్ ను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు.

 

త్వరలోనే రాష్ట్రంలోని క్రిస్టియన్స్ అందరికీ క్రిస్మస్ కానుక అందిస్తామన్నారు. అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని కూడా పునరుద్ధరిస్తామన్నారు. రాష్ట్రంలో రూ.340 కోట్లతో నూతన ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను నిర్మిస్తామని, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా డిసెంబర్, జనవరి నెలలోనే రుణాలు అందిస్తామని తెలిపారు. గత ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ని మూడు ముక్కలు చేసి నిధులు అందివ్వకుండా నిర్లక్ష్యం చేసిందని, తాము మాత్రం లిడ్ కాప్ కు నిధులు అందించి రుణాలు అందిస్తామన్నారు.. ఆటోనగర్ లో విలువైన భూములను అన్యాక్రాంతం చేశారని, అక్కడ పిపిపి మోడల్ లో వాటిని అభివృద్ధి చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా హాస్టల్స్ రిపేరుకు రూ.140 కోట్లు కేటాయించామాన్నారు.

 

ఈ ఐదు నెలల పాలనలో హాస్టల్ విద్యార్థులకు కార్పొరేట్ వైద్యం అందించి, వారి ఆరోగ్యానికి కాపాడే చర్యలు తీసుకున్నామన్నారు. అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి స్థలం కేటాయిస్తే గత ప్రభుత్వం స్థలాన్ని మార్చి విజయవాడ స్వరాజ్ మైదానంలో ఆ విగ్రహం పెట్టారన్నారు.. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ప్రాజెక్టుకు సంబంధించి అసంపూర్తిగా ఉన్న హాల్స్, తదితర పనులను పూర్తి చేస్తామన్నారు.. విజయవాడ నగరంలో ఉన్న హాస్టల్స్ రిపేర్ కి రూ. 42 లక్షల నిధులు కేటాయించామన్నారు.