తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డెడ్ బాడీ పార్శిల్ కేసులో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. ఈ కేసు రోజుకో మలుపు తిరిగింది. సినిమాను తలపించే సస్పెన్స్, థ్రిల్లింగ్ ట్వి్స్టులతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం యండగండి గ్రామంలోని తన వదినకు.. చెక్కపెట్టెలో డెడ్ బాడీ పార్శిల్ చేశాడు శ్రీధర్ వర్మ. ఆస్తి కోసమే వదిన తులసిని బెదిరించినట్లు పోలీసుల విచారణలో తేలింది.
భార్య రేవతి, ప్రియురాలు సుష్మతో కలిసి శ్రీధర్ వర్మ స్కెచ్ వేసినట్లు ఎంక్వైరీలో తేలింది. శ్రీధర్ వర్మ తన వదిన తులసి ఆస్తి కొట్టేందుకు దాదాపు జులై నుంచే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈ కేసులో ప్రధాన అనుమానితుడిగా ఉన్న శ్రీధర్ వర్మ తన వదిన తులసి ఇంటి నిర్మాణానికి అవసరమైన మెటీరియల్స్ అందిస్తున్నట్లు కథ నడిపించాడు.
అదే సమయంలో మెటీరియల్స్ పేరుతో శవాన్ని పంపి తులసిని భయపెట్టాలని చూశారు. దీంతో మొదట ఎక్కడ నుంచైనా శవాన్ని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అది కుదరకపోవడంతో అమాయకుడైన బర్రె పర్లయ్యను చంపేశారని తేలింది. ఇద్దరితో కలిసి బర్రె పర్లయ్యను హత్య చేసినట్లు విచారణలో శ్రీధర్ ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. శవాన్ని ఇంటికి పార్శిల్ చేసి వదిన తులసిని భయపెట్టాలని స్కెచ్ వేసినట్లు చెప్పారు.
ఆస్తి పత్రాలపై సంతకం పెడతావా చస్తావా అంటూ భార్య రేవతితో కలిసి తులసిని బెదిరించారు. ఇప్పటికే పోలీసుల అదుపులో ప్రియురాలు సుష్మ, చిన్నఅల్లుడు శ్రీధర్ వర్మ, చిన్న కూతురు రేవతి ఉన్నారు. ఇవాళ మీడియా ముందుకు డెడ్ పార్శిల్ కేసు ప్రధాన నిందితులను ప్రవేశపెట్టనున్నారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి శ్రీధర్ వర్మ 40 సిమ్స్ మార్చినట్లు గుర్తించారు. ఇక శ్రీధర్ వర్మ అకౌంట్లో 2 కోట్లు గుర్తించారు.
పర్లయ్య అనే వ్యక్తిని హత్య చేసి.. అతని శవాన్ని చెక్కపెట్టెలో పెట్టి.. కోటి 30 లక్షలు చెల్లించాలని లేఖ పంపిస్తే.. తులసి భయాందోళనకు గురై తన మాట వింటుందని శ్రీధర్ ప్లాన్ వేశారు. పక్కా ప్రకారమే పర్లయ్యను హత్యచేసి.. అతని డెడ్ బాడీని పార్శిల్ చేసి వదిన తులసి ఇంటికి పంపాడు. అదేరోజు ఆస్తి పత్రాలపై సంతకాలు సేకరించే ప్రయత్నం చేశాడు శ్రీధర్. అయితే అప్రమత్తమైన తులసి వెంటనే బంధువులకు సమాచారం ఇచ్చింది. బంధువులు వస్తే పోలీసులకు అసలు విషయం తెలిసిపోతుందని శ్రీధర్ వర్మ అక్కడి నుంచి పరారయ్యాడు.