తెలంగాణ ప్రభుత్వం రైతుభరోసా పైన కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఈ అంశం పై సుదీర్ఘంగా చర్చించింది. ఈ పథకం అమలు అర్హుల ఖరారు పైన కొన్ని ప్రతిపాదనలు ముందుకొచ్చాయి. సాగు చేసిన మొత్తం విస్తీర్ణం మేరకు ఇవ్వాలా .. లేక, ఆదాయ పరిస్థితిని పరిగణలోకి తీసుకోవాలా అనేది చర్చించారు. అదే సమయంలో పరిమితి పైనా కసరత్తు చేసారు. సంక్రాంతికి రైతుభరోసా నిధులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రైతు భరోసా దక్కేదెవరికి
రైతు భరోసా అర్హత .. పరిమితి పైన మంత్రివర్గ ఉప సంఘం సుదీర్ఘంగా చర్చించింది. సాగు చేస్తున్న భూములకే రైతు భరోసా ఇవ్వాలనే ప్రతిపాదనకు దాదాపు ఆమోదం లభించింది. ఐటీ చెల్లిస్తున్న వారిలో ఎవరికి మినహాయింపు ఇవ్వాలి.. ఎవరిని కొనసాగించాలి అనే అంశం పైన కీలక ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ చెల్లింపు దారులు అందరినీ పథకం నుంచి మినహాయిస్తే సమస్యలు వస్తాయనే అభిప్రాయం వ్యక్తం అయింది. ఐటీ చెల్లించే సింగరేణి ఉద్యోగులు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో సుమారు 4 లక్షల మంది ఉన్నారని గుర్తించారు. పీఎం – కిసాన్ పథకం అమలులో కేంద్ర మార్గదర్శకాల పైన ఉపసంఘం సమీక్షించింది.
వారికి మినహాయింపు
పీఎం – కిసాన్ లో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదార్లు, వరుసగా రెండేళ్లు ఐటీ చెల్లించినవారు, వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులకు పథకం అమలు చేయటం లేదు.
ఇదే విధంగా ఈ వర్గాలను అమలుకు దూరంగా ఉంచాలంటే వచ్చే ఇబ్బందుల పైనా చర్చ జరిగింది. కాగా, తప్పనిసరిగా సింగరేణి ఉద్యోగులు, నాలుగో తరగతి ఉద్యోగులు ఉండేలా చూడా లనే అభిప్రాయం వ్యక్తం అయింది. ఈ పథకం అమల్లో భాగంగా మొత్తంగా రూ 80,453 కోట్లు చెల్లించగా.. ఇందులో సాగు భూముల కోసం రూ 21,284 కోట్లు చెల్లించారని అధికారులు నివేదిక ఇచ్చారు. సాకుకు వినియోగం లేని భూములకు రైతు భరోసా అమలు చేయకూడదని సమావేశం లో ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
పరిమితి ఎంత
సాగు చేసే భూములకు పథకం అమలు చేస్తే సంపన్నులు, భూస్వాముల విషయంలో ఏం చేయా లనే అంశం చర్చకు వచ్చింది. పథకం పరిమితి 10 ఎకరాలకు ఖరారు చేస్తే ఎంత మందికి మేలు జరుగుతుందని లెక్కలు తీసారు. గత ప్రభుత్వ హయాంలో సుమారు 70 లక్షల మంది రైతులకు రైతుబంధు ఇచ్చారు. ప్రభుత్వం సాగు భూములకే ఇవ్వాలని నిర్ణయిస్తే దాదాపు 20 లక్షల మంది కి కోత పడే అవకాశం ఉందని అంచనా. కాగా, పది ఎకరాలకు పరిమితం చేస్తే ఏ మేర భారం పడుతుందనే లెక్కల పరిగణలోకి తీసుకున్నారు. పూర్తి అంశాల పైన మరో సారి సమావేశం కావాలని డిసైడ్ అయ్యారు. జనవరి తొలి వారంలోనే విధి విధానాలు పూర్తి చేసి.. మార్గదర్శకాలు ప్రకటించాలని భావిస్తున్నారు. సంక్రాంతికి నిధులు విడుదల చేసే విషయానికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.