తెలుగు రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ MLC స్థానాలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. ఓటర్లకు తాయిలాలు పంచేందుకు ప్రధాన పార్టీలు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. సోమవారం జరిగే ఎన్నికలకోసం అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రచారం ముగిసింది. చివరిరోజు కావడంతో ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకోవాలని అధికారపార్టీ ఉవ్విలూరుతుండగా, అటు విపక్షాలు ఆ స్థానాలను దక్కించుకునేందుకు జోరుగా ప్రచారం చేశాయి. తూర్పు, పశ్చిమ రాయలసీమ, ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖలో గ్రాడ్యుయేట్ స్థానాలకు ఎన్నికలు, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు టీచర్స్ ఎన్నికలు జరగనున్నాయి. సోమవారం ఉదయం 8 నుంచి 4 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. 16న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆ వెంటనే ఫలితాలు విడుదల కానున్నాయి.