ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక తీసుకున్న కీలక నిర్ణయం పెన్షన్ల పెంపు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ల మొత్తాన్ని పెంచిన సీఎం చంద్రబాబు.. అదే సమయంలో అనర్హులకు వీటి ప్రయోజనం అందకుండా కట్ చేయాలనే ఆదేశాలు కూడా ఇచ్చారు. దీంతో అధికారులు పెన్షన్లు తీసుకుంటున్న వారిలో అనర్హుల్ని గుర్తించేందుకు వివిధ రకాల సర్వేలు చేపడుతున్నారు. ఇప్పటికే అనర్హుల గుర్తింపుకు పలు సర్వేలు చేసిన అధికారులు ఇప్పుడు మరో సర్వేకు సిద్దమయ్యారు.
ఇప్పటివరకూ ఏపీలో ఉంటూ పెన్షన్ తీసుకునేందుకు అనర్హులుగా ఉన్న వారిపై సర్వేలు చేసిన అధికారులు వారిని జాబితా లో నుంచి తొలగిస్తున్నారు. ఇప్పుడు ఏపీలో ఉండకుండా ఎక్కడో ఇతర రాష్ట్రాలలోనో, లేక విదేశాల్లోనో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ తీసుకుంటున్న వారిని గుర్తించేందుకు మరో సర్వే నిర్వహించబోతున్నారు. ఇతర రాష్ట్రాలు , దేశాల్లో నివసిస్తున్న ఏపీ కి సంబంధించిన పింఛన్ దారులపై త్వరలో సర్వే చేపట్టనున్నారు.
ఇప్పటికే పెన్షన్లకు సంబంధించి ఇంటింటి సర్వే చేయిస్తున్న ఏపీ ప్రభుత్వం… త్వరలో ఇలా విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న వారిని గుర్తించబోతోంది. త్వరలో ఇతర రాష్ట్రం , దేశం విడిచి వెళ్లిన వారి వివరాలు సేకరించబోతున్నారు. కేరళ తర్వాత అత్యధికంగా విదేశాల్లో ఉంటున్న వారిలో ఏపీ వారు ఎక్కువ ఉన్నారని గుర్తించిన ప్రభుత్వం.. ఆ మేరకు వారిని జాబితాలో నుంచి తప్పించేందుకు సిద్దమవుతోంది. ప్రతి ఇంటికి జియో టాగింగ్ తో సర్వే నిర్వహించి వివరాలు సేకరించనున్నారు. బీమా లేక ఇతర పథకాలకు సంబంధించి ప్రభుత్వం దగ్గర పూర్తి సమాచారం లేకపోవడంతో సర్వేపై దృష్టి సారిస్తున్నారు.