తెలంగాణలో ఫార్ములా ఈ కార్ రేసింగ్ రేసులో బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఫార్ములా ఈ కార్ రేసింగ్‌లో ఎలాంటి నిబంధనలు పాటించకుండా రూ.55కోట్లు ఎలా బదలీ చేస్తారనే ఆరోపణలు ప్రధానంగా ఆయన ఎదుర్కొంటున్నారు. కేటీఆర్ ఈడీ ఆఫీస్‌కు చేరుకున్నారు. కాసేపట్లో ఆయనను ఈడీ అధికారులు విచారించనున్నారు.
అయితే ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్‌ను జనవరి 9న విచారించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన ఏసీబీ తన విచారణలో నిబంధనలకు విరుద్ధంగా ఫార్ములా ఈ-కారు రేసింగ్‌కు నిధుల చెల్లింపునకు అనుమతులు ఎవరు ఇచ్చారు..? నిధులు ఎక్కడికి చేరాయి..? ఎవరెవరి చేతులు మారాయో? అన్న కోణంలో కేటీఆర్ విచారించినట్లు తెలుస్తోంది.మొదటి సారి ఈడీ విచారణకు హాజరు కానీ కేటీఆర్‌కు ఈరోజున రెండోసారి విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసింది. కేటీఆర్ ఒత్తిడితోనే రూల్స్ పాటించుకుండా రూ.55 కోట్ల బదిలీలు జరిగినట్లు ఏసీబీ పేర్కొంది.
రేవంత్ సర్కార్ పెడుతున్న కేసులు.. తమ ఘనతను తుడిచివేయలేవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈడీ విచారణకు హాజరయ్యేముందు కేటీఆర్ ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మహానగరంలో ఫార్ములా ఈ రేసు నిర్వహించాలనేది.. తాను మంత్రిగా తీసుకన్న అత్యంత ప్రతిష్టాత్మక నిర్ణయాల్లో ఒకటని చెప్పారు. రేస్ పూర్తి అయ్యాక ఆనాడు.. రేసర్లు అందరూ హైదరాబాద్ నగరాన్ని కీర్తించారని అన్నారు. హైదరాబాద్ ఇమేజ్‌ను పెంచాలనే ఈ రేసు నిర్వహించినట్లు కేటీఆర్ తెలిపారు. పారదర్శకంగా రూ.46కోట్లు బ్యాంక్ టు బ్యాంక్ విధానంలో చెల్లించిన తర్వాత అసలు అవినీతి అనేది ఎక్కడ జరిగింది..? మనీ లాండరింగ్ ఎక్కడది..? ఇక్కడ ఒక్క రూపాయి కూడా వృథా కాలేదని అన్నారు.
ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ప్రతి పైసాకు లెక్క ఉందని చెప్పారు. ఫార్ములా ఈ రేసు రద్ద చేయడం వల్ల ప్రభుత్వానికి తీవ్ర నష్టం జరిగిందని.. పైగా ఎలాంటి అవినీతి జరగకున్నా కేసులు, కోర్టులంటూ రాజకీయ వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దూరదృష్టి లేకపోవడం వల్లే ఏకపక్షంగా తర్వాతి సీజన్ రద్దు చేశారని అన్నారు. కచ్చితంగా ఈ కేసులో నిజమే గెలుస్తుందని పేర్కొన్నారు. కేసులో తను ఎలాంటి తప్పు చేయకపోయినప్పటికీ ఏదో కాలం వెల్లదీసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు. తప్పకుండా త్వరలోనే నిజం గెలుస్తుందని కేటీఆర్ ట్వీట్ చేశారు.