TELANGANA

16 ఏళ్ల లోపు పిల్లలు సినిమా థియేటర్లకు వెళ్లే వేళలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ హైకోర్టు పదహారేళ్లలోపు పిల్లలు సినిమా థియేటర్లకు వెళ్లే అంశంపై కీలక ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు పదహారేళ్లలోపు పిల్లలను థియేటర్లలోకి అనుమతించవద్దని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ విషయంపై అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది.

 

సినిమా టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి అంశంపై దాఖలైన పిటిషన్లపై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. వేళాపాలా లేని షోలకు పిల్లలు వెళ్లడం వల్ల వారి ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని ధర్మాసనం దృష్టికి పిటిషనర్ తీసుకువచ్చారు.

 

పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలతో న్యాయమూర్తి జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఏకీభవించింది. ఈ నేపథ్యంలో రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు పదహారేళ్లలోపు పిల్లలను థియేటర్లలోకి అనుమతించవద్దని ఆదేశించిన ధర్మాసనం, తదుపరి విచారణను ఫిబ్రవరి 22కు వాయిదా వేసింది.