ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగు చూస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ హైకోర్టులో పని చేసిన 18 మంది న్యాయమూర్తుల డీటైల్స్.. ఈ కేసుకు సంబంధించిన నిందితుడి కంప్యూటర్లో ఉన్నట్టు తేలింది. అందులో ఐదుగురు మహిళా న్యాయమూర్తుల సమాచారమూ ఉంది. ఫోన్ ట్యాపింగ్‌పై తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు టీంపై ఇదివరకే కేసు నమోదైంది.
హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లను, వారు అధికారికంగా వినియోగిస్తున్న కంప్యూటర్లను విశ్లేషించడానికి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఎఫ్ఎస్ఎల్కు పంపారు. మూడో నిందితుడైన భుజంగరావు కంప్యూటర్ హార్డ్ డిస్క్‌కు సంబంధించి పోలీసులకు ఎఫ్ఎస్ఎల్ నివేదిక అందింది.
ఆ కంప్యూటర్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నియోజకవర్గ స్థాయి నేతలు, ఎమ్మెల్యే అభ్యర్థులు, పలువురు న్యాయమూర్తుల ప్రొఫైల్స్ ఉన్నాయి. ఈ మధ్య పదవీ విరమణ చేసిన ముగ్గురి ప్రొఫైల్సతో సహా మొత్తం 18 మంది న్యాయమూర్తుల డీటైల్స్ లభించాయి. అందులో పదోన్నతి మీద సుప్రీంకోర్టుకు వెళ్లిన న్యాయమూర్తి సమాచారమూ ఉంది. తెలంగాణ హైకోర్టు నుంచి ఇతర హైకోర్టులకు బదిలీ అయిన మరో ముగ్గురి వివరాలూ ఉన్నాయి.
హైకోర్టు న్యాయమూర్తులకే పరిమితం కాకుండా అవినీతి నిరోధక చట్టం కింద ఏర్పాటైన నాంపల్లి ఏసీబీ కోర్టులోని ఓ కీలక జడ్జి ప్రొఫైల్ కూడా లభించింది. ఈ ప్రొఫైళ్లలో వారి ఫొటోలు, పుట్టుపూర్వోత్తరాలు, విద్యాభ్యాసం, ఉద్యోగప్రస్థానం, కుటుంబసభ్యుల్లాంటి అన్ని వివరాలు ఉన్నట్లు తెలిసింది. ఎఫ్ఎస్ఎల్ నివేదికలోని పూర్తి వివరాలు బహిర్గతమైతే మరిన్ని సంచలన విషయాలు వెలుగుచూసే అవకాశముంది.
కాగా గురువారం నాడు ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకిషన్‌రావుకు రెగ్యులర్ బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. భుజంగరావు, రాధాకిషన్‌రావుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయలతో కూడిన రెండు షూరిటీలు.. సమర్పించాలని షరతు విధించింది. పాస్ పోర్టులు సమర్పించాలని ఇద్దరికీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కేసులో దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. ఇదే కేసులో మరో నిందితుడు, మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు గతేడాది మార్చిలో అరెస్టయ్యారు. గత ఆగస్టులో వైద్య పరీక్షలు, శస్త్ర చికిత్సల కోసం నాంపల్లి కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అప్పటి నుంచి ఆ ఉత్తర్వులను కోర్టులు పొడిగిస్తూ వస్తున్నాయి. రెగ్యులర్ బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తీర్పును ఇచ్చింది.