AP

ఆ రెండు పథకాలకు త్వరలో గ్రీన్ సిగ్నల్..

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, పింఛన్ నగదును పెంచి లబ్దిదారుల్లో ఆనందాన్ని నింపింది. అది కూడ పింఛన్ దారుడు మృతి చెందితే వెనువెంటనే సదరు లబ్దిదారుడి భార్యకు పింఛన్ మంజూరు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఎందరో పింఛన్ దారులకు మేలు చేకూరుతుందని చెప్పవచ్చు. అంతేకాదు పింఛన్ మార్పుకు కూడ ఇటీవల ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు దీపావళి రోజు దీపం 2.ఓ పథకాన్ని అమలు చేసి, ఏడాదికి మూడు సిలిండర్లను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

 

సూపర్ సిక్స్ అంటూ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం, ఓ వైపు రాష్ట్రంలోని రహదారుల అభివృద్ది, మరోవైపు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు కూడ చేయడంతో విద్యార్థి సంఘాలు ఆనందం వ్యక్తం చేశాయి. అంతేకాదు ఆఫీసుల చుట్టూ.. ప్రజలు కాళ్లరిగేలా తిరిగే సమస్యలకు చెక్ పెడుతూ.. వాట్సాప్ గవర్నెన్స్ ను కూడ అమలు చేసింది. ఇలాంటి తరుణంలో మరో రెండు కొత్త నిర్ణయాలకు ప్రభుత్వం ముందడుగు వేయబోతున్నట్లు ఇటీవల మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు.

 

ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఆధారం. ఈ కార్డు లేకుంటే ఏ పథకం వర్తించదు. అందుకే రేషన్ కార్డుకు అంత ప్రాధాన్యత ఉంటుంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం కూడ నూతన రేషన్ కార్డులను మంజూరు చేసింది. అదే తరహాలో ఏపీ ప్రభుత్వం కూడ అతి త్వరలో నూతన రేషన్ కార్డులను అందించేందుకు చర్యలు తీసుకోనుందట. అర్హత ఉండి కూడ రేషన్ కార్డు లేని వారి జాబితాను ఇప్పటికే అధికారులు సిద్దం చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. నూతన రేషన్ కార్డులను మంజూరు చేసి, అర్హులకు మేలు చేకూర్చాలన్నది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. అయితే ఈ విషయంపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉన్నప్పటికీ, ఇటీవల సీఎం చంద్రబాబు ఇదే విషయంపై ఆరా తీసినట్లు తెలుస్తోంది.

 

అంతేకాకుండ నూతన పింఛన్ లను కూడ మంజూరు చేసేందుకు ప్రభుత్వం ముందడుగు వేస్తోందట. ఇప్పటికే పింఛన్ పొందుతున్న అనర్హులను గుర్తించేందుకు అధికారులు ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించారు. అందులో సుమారు 10 వేలకు పైగా అనర్హులను ప్రభుత్వం గుర్తించిందని తెలుస్తోంది. అనర్హులకు ప్రభుత్వ పథకాల లబ్ది కంటే, అర్హులకు మేలు చేకూర్చాలని ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. అందుకే త్వరలో నూతన రేషన్ కార్డులను మంజూరు చేయడంతో పాటు, నూతన పింఛన్ లను కూడ అందించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. అయితే ఈ రెండు కార్యక్రమాలను అమలు చేయడంపై ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.