గత ఎన్నికల్లో ఘోర ఓటమి. కుదురుకునే లోపు ఒక్కొక్కరుగా నేతల జంప్. నా అనుకున్న వారు దూరం కావటంతో వైసీపీ అధినేత జగన్.. ఆలోచనలో పడ్డారట. కీలకనేతల రాజీనామాలతో.. పార్టీలో స్తబ్ధత నెలకొందట. వచ్చే ఎన్నికల్లో విజయం ఖాయమని క్యాడర్‌కు భరోసా ఇస్తుంటే.. పార్టీ నడిపించటంలో తనకు తోడుగా ఉన్న ప్రముఖులు వీడటంతో వైసీపీ అధినేత ఇరకాటంలో పడ్డారట. విదేశీ పర్యటన ముగించుకుని.. స్వదేశానికి తిరిగొచ్చిన ఫ్యాన్ పార్టీ అధినేత.. రూట్ మ్యాప్ ఏంటనే చర్చ జోరుగా సాగుతోంది. పార్టీని వీడిన నేతల మాటెలా ఉన్నా.. ఉన్నవారిని ఆయన ఎలా కాపాడుకుంటారోననే సస్పెన్స్ నెలకొంది.
వైసీపీకి కీలకనేతల.. వరుస రాజీనామాలు షాక్ ఇస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించిన వారంతా సొంతదారి వెతుక్కోవటం.. YCPని షేక్ చేస్తోందట. ఫలితాల అనంతరం సైలెంట్ అయిపోయిన లీడర్లు, క్యాడర్.. ఇప్పుడిప్పుడే కోలుకుని బయటకు వస్తున్న తరుణంలో.. నేతల రాజీనామాలు పెద్దదెబ్బగా మారాయట. గత ఎన్నికల ఫలితాలు డిజాస్టర్‌గా మారినా.. రాజ్యసభలో తమకున్న బలంతోనే నెట్టుకురావచ్చని భావించిన జగన్‌కు.. విజయసాయిరెడ్డి రూపంలో మరో షాక్ తగిలిందని రాజకీయ నిపుణులు చర్చించుకుంటున్నారు. పార్టీకి పెద్దగా ఉన్న వారే ఒక్కొక్కరుగా బయటకు వచ్చేస్తుండటం.. శ్రేణుల్లో అలజడి రేపుతోందట. కోలుకోలేని దెబ్బతిన్న వైసీపీకి.. తిరిగి కంబ్యాక్ తెచ్చేందుకు జగన్ నానా తంటాలు పడుతున్నారని టాక్ నడుస్తోంది.
ఎంతమంది నేతలు పార్టీని వీడినా జగన్ మాత్రం ధైర్యంగా ఉన్నారు. పార్టీని రీసెట్ చేసే కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. ఇప్పుడిప్పుడే పార్టీ కార్యకర్తలు కూడా బయటకు రావటం.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేయటంతో.. కాస్తో కూస్తే బెటర్ పొజిషన్ ఉందట. దీంతో మాజీమంత్రులతో పాటు చాలామంది నేతల ప్రెస్‌మీట్‌లతో కాస్త నయం అనుకున్న సమయంలో.. విజయసాయిరెడ్డి రాజీనామా ప్రకటన ఆ పార్టీని ఇరకాటంలో పడేసిందట. తాను మాత్రం జగన్‌కు అన్నీ చెప్పి బయటకు వచ్చానని సాయిరెడ్డి చెబుతున్నా.. పార్టీ అధినేత లేని సమయంలో.. నెంబర్ టూగా చెలామణీ అయిన నేత.. తప్పుకోవటంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
రాజ్యసభలో వైసీపీకి.. 11 మంది సభ్యుల బలం ఉంది. కేంద్రంలో బీజేపీకి అవసరమైన సమయాల్లో ఆ పార్టీ మద్దతు ఇస్తూ వస్తోంది. కొద్ది రోజుల క్రితం వైసీపీ నుంచి ఆరేడుగురు మంది రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేయబోతున్నారనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి బలం చేకూరుస్తూ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య రాజీనామాలు చేసి.. తమ గూడు తాము వెతుకున్నారు. తాజాగా వైసీపీ కీలకనేత, ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా ప్రకటన ఆ పార్టీలో కలకలం రేపింది. రాజ్యసభ సభ్యుడిగా, వైసీపీ కీలక నేతగా, విశాఖ రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకుడిగా.. సాయిరెడ్డి పేరు తెచ్చుకున్నారు.
అందులో మంచి కంటే, చెడు ఎక్కువ ఉందనేది బహిరంగ రహస్యమేననే టాక్ ఉంది. సోషల్ మీడియా వేదికగా.. ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలు చేయడంలోనూ… ఆ క్రమంలో చీవాట్లు తినడంలోనూ విజయసాయిరెడ్డికి సాటి ఇంకెవరూ లేరని పొలిటికల్ వర్గాల్లో చర్చ సాగుతోంది. సడెన్‌గా ఏమైందో కానీ.. వైసీపీని వీడారు విజయసాయిరెడ్డి. గత ఎన్నికల్లో నెల్లూరు నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారాయన. తర్వాత కూడా పార్టీలో యాక్టివ్‌గానే ఉన్నా.. సీపీని వీడతారంటూ ప్రచారం జరిగింది. దానిని ఎవరూ నమ్మకపోయినా.. వన్ ఫైన్ డే ఆయన తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
పార్టీ అధినేత జగన్.. లండన్ పర్యటనలో ఉన్న సమయంలో విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన బాటలోనే మరో ఎంపీ వైసీపీకి రాజీనామా చేయబోతున్నారంటూ ప్రచారం సాగుతోందట. రాజ్యసభ సభ్యుడు అయోధ్యరామిరెడ్డి కూడా వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారనే ప్రచారం జరిగినా.. ఆయన అలాంటిదేమీ లేదని క్లారిటీ ఇచ్చారు. కానీ జయసాయిరెడ్డి, ఆయోధ్య రామిరెడ్డి సన్నిహితులు కావడంతో ఆయన కూడా రాజీనామా చేసే అవకాశాలు లేకపోలేదని రాజకీయవర్గాల్లో టాక్ నడుస్తోంది.
వీరితో పాటు గత ఎన్నికల ముందు వరకు వైసీపీలో కీలకంగా వ్యవహరించిన బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ల నాని వంటి నేతలు కూడా దూరమయ్యారు. ధర్మాన ప్రసాదరావు వంటి నేతలు సైలెంట్ అయ్యారు. కొడాలి నాని.. ఇంకా అజ్ఞాతం వీడలేదు. దీంతో.. పార్టీలో అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందట.
గతంలో పార్టీ నుంచి అన్నీ ప్రయోజనాలు పొంది. కష్టకాలంలో ఉండాల్సిన నేతలు ఒక్కొక్కరుగా దూరం కావడంపై క్యాడర్ మాత్రం మండిపడుతోందట. కార్యకర్తలకు అండగా ఉంటూ భరోసా ఇవ్వాల్సిన నేతలు వ్యక్తిగత కారణాలతో పార్టీకి దూరం కావటం సరైన నిర్ణయం కాదనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయట. మరోవైపు పార్టీని వీడుతున్న నేతలపై జగన్ గతంలోనే స్పందించారు. పోయేవారిని పోనీయండి.. ఉండేవారు ఉంటారు.. వారితోనే రాజకీయం చేస్తానంటూ క్యాడర్‌కు భరోసా ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో మనదే విజయం అంటూ ధైర్యం చెప్పారు.
వారి వారి.. వ్యక్తిగత కారణాలతో వెళ్లిపోయే వారిని బుజ్జగించలేమన్నది జగన్ అభిప్రాయంగా తెలుస్తోంది. బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా సమయంలోనూ ఇదే తరహాలో లైట్ తీసుకున్న జగన్.. ఇప్పుడు విజయసాయిరెడ్డి వ్యవహారాన్ని కూడా అలాగే లైట్ తీసుకుంటారా అనేది చర్చనీయాంశంలా మారింది.
రాజీనామా ప్రకటనలో జగన్‌ను.. ఒక్క మాట కూడా అనని విజయసాయిరెడ్డి.. తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారు. గతంలో ఉన్న కేసులకు తోడు కాకినాడ పోర్టు వంటి కొత్త కేసులు జత కావటం రాజకీయంగా నిర్వేదానికి గురై.. ఇలాంటి నిర్ణయానికి వచ్చి ఉంటారని చాలామంది భావిస్తున్నారట. అయితే ఇప్పటికే ఈ అంశంపై జగన్‌కు కచ్చితంగా సమాచారం ఇచ్చే.. తన నిర్ణయాన్ని ప్రకటించి ఉంటారని తెలుస్తోంది. మరి అంశంపై జగన్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది. పార్టీలో.. ఈ షాకింగ్.. షేకింగ్‌లను ఆయన ఎలా సెట్ చేస్తారనే ప్రశ్నార్థకంగా మారింది. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన జగన్.. విజయసాయిరెడ్డి రాజీనామాపై ఎలా స్పందిస్తారోననే ఉత్కంఠ నెలకొంది. మిగిలిన నేతలను కాపాడుకునేందుకు జగన్ ముందున్న వ్యూహాలేంటి అనేది పొలిటికల్ వర్గాల్లో సస్పెన్స్‌గా మారింది.