బెట్టింగ్ యాప్ల వ్యవహారంపై టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. బెట్టింగ్ యాప్ల బాధితులకు ఆయన ఒక విజ్ఞప్తి చేశారు. సమస్య ఏదైనా ఆత్మహత్య పరిష్కారం కాదని ఆయన అన్నారు. ‘బలవన్మరణం వద్దు… బతికి సాధించడమే ముద్దు’ అని బెట్టింగ్ యాప్ల బాధితులకు సూచించారు.
ఆన్లైన్ బెట్టింగ్ బాధితులు బలవన్మరణాలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. “ఆలోచించండి.. మీరు క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల మీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎంతటి క్షోభను అనుభవిస్తారో. సమస్య వచ్చినప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలో అన్వేషించాలే తప్ప.. చనిపోవాలనే ఆలోచనే రాకూడదు” అని సూచించారు.
మనకు ఉన్నది ఒక్కటే జీవితమని, ఏం సాధించినా ఈ జీవితంలోనే అని పేర్కొన్నారు. జీవన ప్రయాణంలో ఒక్కసారి కిందపడితే సర్వం కోల్పోయినట్లుగా భావించవద్దని హితవు పలికారు. అమూల్యమైన జీవితాన్ని అర్ధాంతరంగా కాలదన్నుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
చీకటి వెలుగుల వలె నిత్యం కష్టసుఖాలు అందర్నీ వెంటాడుతూనే ఉంటాయని, కష్టకాలంలో బాధలను ఇతరులతో పంచుకోవాలని సూచించారు. తద్వారా పరిష్కార మార్గాలు వెతకాలని ఆయన అన్నారు. ఎంత కష్టం వచ్చినా ఎల్లకాలం ఉంటుందా? చనిపోయినంత మాత్రాన సమస్యలు టక్కున మాయమవుతాయా!? అని ప్రశ్నించారు.