తిరుమలలోని ఎస్వీ గోశాల అంశం ఏపీలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. గోశాలలో వందకు పైగా ఆవులు చనిపోయాయంటూ వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలు రాజకీయ రంగు పులుముకున్నాయి. భూమన వ్యాఖ్యలపై కూటమి నేతలు మండిపడుతున్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న భూమనపై కేసు నమోదు చేయాలంటూ బీజేపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు, తాజాగా భూమనపై టీడీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. టీటీడీలో అన్ని అక్రమాలు వైసీపీ హయాంలోనే జరిగాయని విజిలెన్స్ రిపోర్టు బయటపెట్టిందని తెలిపింది. గోశాలలో వందకు పైగా గోవులు చనిపోయాయని అసత్య ప్రచారం చేస్తున్నారని… ఫేక్ ఫొటోలతో టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడింది. అసత్య ప్రచారం చేసిన వైసీపీ పార్టీ అధినేత జగన్, భూమన గోశాలకు రావాలని సవాల్ విసిరింది. గోశాలకు వచ్చి పరిస్థితిని నేరుగా చూడాలని ఎక్స్ వేదికగా ఛాలెంజ్ చేసింది. దీనిపై భూమన స్పందిస్తూ… ఈరోజు ఉదయం 10 గంటలకు గోశాలలో కలుద్దామని ప్రకటన విడుదల చేశారు. అయితే, తాను తిరుమల గోశాల గురించి మాట్లాడలేదని… తిరుపతి గోశాల గురించి మాట్లాడానని భూమన చెప్పడం గమనార్హం.
ఇంకోవైపు, తిరుమల గోశాలను సీఐపీ నేత నారాయణ నిన్న పరిశీలించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ… గోవులు చనిపోయాయనే ప్రచారంలో నిజం లేదని అన్నారు. గోశాలలో కావాల్సినంత దాణా ఉందని, గోవులు పుష్టిగా ఉన్నాయని చెప్పారు. రాజకీయాలకు టీటీడీని వాడుకోవాలనుకోవడం సహేతుకం కాదని అన్నారు.
