ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. ప్రతి నెల 3వ శనివారం రోజున రాష్ట్రవ్యాప్తంగా ‘స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందుకోసం వివిధ థీమ్ లను అనుసరిస్తున్నారు. ఏప్రిల్ నెల థీమ్ ను తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
“స్వర్ణాంధ్ర-2047 సంకల్పంలో భాగంగా ‘స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం ప్రతి నెలా 3వ శనివారం నాడు జరుపుకుంటున్నాం. ప్రతి కార్యక్రమం స్ఫూర్తివంతంగా ఉండేందుకు నెల నెలా ఒక్కో థీమ్ ను ఎంచుకుని నిర్వహిస్తున్నాం. ఈసారి ‘ఈ-వ్యర్థాల సేకరణ, వాటిని సురక్షిత పద్ధతుల్లో రీసైకిల్ చేయడం’ థీమ్ ను ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే చెత్త నుంచి సంపద సృష్టించడం ద్వారా సర్క్యులర్ ఎకానమీ సాధ్యం అవుతుంది.
ఈ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎన్జీఓలు, కార్పొరేట్ సంస్థలు, విద్యార్థులు, యువత స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరుతున్నాను. ఎక్కడికక్కడ ఇ-వేస్ట్ సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయండి. వీటి నిర్వహణకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఎస్‌హెచ్‌జి సభ్యులను గుర్తించి.. వారి సేవలను వినియోగించుకోండి.
‘రెడ్యూస్, రీయూజ్, రీ సైకిల్” అనేది ఈ – వేస్ట్ కలెక్షన్ సెంటర్ల నినాదం కావాలి. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసి తద్వారా స్వర్ణాంధ్ర సంకల్పాన్ని మరింత ముందుకు వెళ్లే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాను” అని చంద్రబాబు పిలుపునిచ్చారు.