TELANGANA

కవిత కొత్త పార్టీ..?

ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. బీఆర్ఎస్ లో జరుగుతోన్న తాజా రాజకీయ పరిణామాలపై ఆయనతో చర్చించారు. ఈ తాజా పరిణామాల మధ్య కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ అవ్వడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన సంచలన లేఖ వైరల్ అయిన తర్వాత కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దాదాపు గంటన్నర సేపు వీరిద్దరి మధ్య సమావేశం కొనసాగింది. భేటీ ముగిసిన తర్వాత కేటీఆర్ ఎర్రవల్లి ఫాం హౌజ్ నుంచి వెళ్లిపోయారు.

 

కవిత వ్యాఖ్యలతో అసంత‌ృప్తిలో కేసీఆర్

 

వీరి ఇరువురి సమావేశంలో ఎమ్మెల్సీ కవిత ఇటీవల చేసిన వ్యాఖ్యలు, తదనంతర పరిణామాలపై తీవ్రంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద కవిత చేసిన వ్యాఖ్యల పట్ల కేసీఆర్ కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. పార్టీ అంతర్గత విషయాల గురించి.. ఇతర పార్టీ నాయకులకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వొద్దని కేటీఆర్‌కు కేసీఆర్ సూచించినట్టు తెలుస్తోంది. అలాగే ఈ భేటీలో కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన నోటిసుల గురించి కూడా చర్చించినట్టు వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్‌ 2వ తేదీన నిర్వహించబోయే కార్యక్రమాలపై కూడా చర్చించినట్టు సమాచారం.

 

కేటీఆర్‌కు కేసీఆర్ కీలక సూచనలు

 

ఈ భేటీలో ముఖ్యంగా కేటీఆర్‌కు కేసీఆర్ కొన్ని కీలక సూచనలు ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్సీ కవిత అంశాన్ని బయట మాట్లాడొద్దని కేసీఆర్ ఆదేశించినట్టు సమాచారం. పార్టీ అంతర్గత విషయాలు, కుటుంబంలో ఎలాంటి విభేదాలు వచ్చినా.. మీడియా ముందు అసలు మాట్లాడొద్దని కేటీఆర్‌ను హెచ్చరించినట్టు తెలుస్తోంది. పార్టీలో జరిగే ఎలాంటి విషయాలైనా.. బయటకు లీక్ అవ్వొద్దని.. ఏదైనా ఉంటే తన ముందే చర్చించుకోవాలని కేటీఆర్‌కు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.

 

కవిత కొత్త పార్టీ..?

 

గత కొన్నాళ్ల నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీకి దూరంగా ఉంటోంది. సొంతంగా పార్టీ చేసి.. జనాల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు కూడా తెగ ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కవితకు, కేటీఆర్ కు మధ్య విభేదాలు వచ్చినట్టు కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. జైలు నుంచి బయటకు వచ్చాక కవిత ఇల్లునే రాజకీయ వేదికగా మార్చుకున్నారు. ముఖ్యంగా పార్టీలో ఆమెకు సరైన ప్రాధాన్యం లేకపోవడం వల్లే.. గత కొన్ని రోజుల నుంచి సొంత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు అభిప్రాయాలు బీఆర్ఎస్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి సొంత అజెండాతో కొత్త పార్టీ పెట్టుబోతున్నట్టు జోరుగా చర్చ జరుగుతోంది. అయితే ఇందుకు తాజా పరిణామాలు చూస్తుంటే మరింత బలాన్ని చేకూరిస్తున్నాయి.