TELANGANA

నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్, మంత్రుల భేటీ: చర్చించిన అంశాలివే..

కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్గడ్కరీతో మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రాష్ట్ర మంత్రులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం, ఫ్లై ఓవర్ల ప్రాజెక్టుల అంశంపై కేంద్రమంత్రితో సీఎం చర్చలు జరిపారు. ముఖ్యంగా రాష్ట్రాభివృద్ధికి తోడ్పడే ప్రధాన రహదారులు, రీజనల్రింగ్రోడ్డు సహా పలు అంశాలపై సుమారు గంటపాటు చర్చలు జరిపారు.

 

ఈ సమావేశంలో సీఎం రేవంత్ వెంట ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. ఈ భేటీలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన రోడ్ల అభివృద్ధితో పాటు, అంతర్జాతీయ సంస్థల నుంచి రావాల్సిన నిధుల గురించి చర్చించినట్లు సమాచారం.

 

వీటితో పాటు భువనగిరి రహదారి, సిర్పూర్‌ – కాగజ్‌నగర్‌ నేషనల్హైవే, శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన తీగల వంతెనను మరో చోటికి మార్పు చేయాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్రెడ్డి కోరినట్లు తెలిసింది. రాష్ట్రంలోని పలు రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని కోరినట్లు సమాచారం.

 

కాగా, కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టడంపై రేవంత్ప్రభుత్వం ప్రధానంగా దృష్టిసారించింది. బకాయిలు సహా వివిధ రూపాల్లో వచ్చే గ్రాంట్లను పొందేలా కసరత్తు కొనసాగిస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులను కలిసి ప్రత్యేక విజ్ఞాపన చేస్తున్నారు. మరికొందరు కేంద్రమంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది.