AP

రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం..

రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. పేదల కోసం ఉద్దేశించిన సబ్సిడీ బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేసే వారిపై పీడీ యాక్ట్, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ల కింద కఠిన కేసులు నమోదు చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అయితే, నిబంధనలు పాటిస్తూ చేసే చట్టబద్ధమైన బియ్యం ఎగుమతులకు తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

 

సచివాలయంలోని తన ఛాంబర్‌లో కాకినాడ, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాల జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి మనోహర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎగుమతి చేసే బియ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పీడీఎస్ బియ్యం కలవకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తేల్చిచెప్పారు.

 

రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు రాష్ట్రంలోని కీలకమైన కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం (నెల్లూరు) పోర్టుల వద్ద 24/7 పనిచేసేలా చెక్‌పోస్టులు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. అవసరాన్ని బట్టి మరిన్ని చెక్‌పోస్టులను పెంచాలని సూచించారు. కాకినాడ పోర్టులో నియంత్రణ మెరుగ్గా ఉందని, ఇదే తరహా పటిష్టమైన నిఘాను విశాఖ, నెల్లూరు పోర్టుల వద్ద కూడా అమలు చేయాలన్నారు. జాతీయ రహదారులపై కూడా అనుమానం ఉన్నచోట తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేసి నిఘా ముమ్మరం చేయాలని విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.

 

రాష్ట్రవ్యాప్తంగా అక్రమ రవాణాపై ఇప్పటికే కేసులు నమోదవుతున్నాయని అధికారులు మంత్రికి వివరించారు. కాకినాడ జిల్లాలో 85, విశాఖపట్నంలో 92, నెల్లూరు జిల్లాలో 62 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వీటిలో పోర్టు ప్రాంతాలకు సంబంధించిన కేసులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.