AP

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయంపై దాడి..! ఫర్నీచర్ ధ్వంసం..

మేడిపల్లిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయంపై మరోసారి దాడి జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జాగృతి కార్యకర్తలు ఆయన కార్యాలయంపై దాడి చేశారు.

 

తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఆర్డినెన్స్ తెస్తే.. సంబరాలు చేసుకోవడానికి కవిత ఎవరంటూ ప్రశ్నించారు మల్లన్న. మెదక్ జిల్లాలో జరిగిన సభలో కవితను ఉద్దేశించి ఆయన చేసిన వాఖ్యలపైనే ఇప్పుడు వివాదం రాజుకుంది.

 

ఫర్నీచర్ ధ్వంసం – గన్‌మెన్ కాల్పులు

జాగృతి కార్యకర్తలు మల్లన్న క్యూ న్యూస్ ఆఫీస్‌ను లక్ష్యంగా చేసుకుని.. తీవ్రంగా దాడి చేశారు. ఆఫీస్‌లో ఉన్న ఫర్నీచర్, అద్దాలను పగలగొట్టి కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. పరిస్థితిని అదుపులోకి తేవాలనే ఉద్దేశ్యంతో.. మల్లన్నకు భద్రతగా ఉన్న గన్‌మెన్ గాల్లోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల సమయంలో అక్కడ ఉన్న కొంతమంది గాయపడినట్లు సమాచారం. మల్లన్న కుడి చేతికి స్వల్పంగా గాయమైంది.

 

భయాందోళన

దాడి అనంతరం ఆఫీసు అంతా రక్తపు మరకలతో నిండిపోవడంతో భయాందోళన నెలకొంది. గాయపడినవారిని వెంటనే ఆసుపత్రులకు తరలించారు. ప్రస్తుతం పరిస్థితి స్థిరంగా ఉన్నప్పటికీ, ఈ ఘటన స్థానికంగా భయాన్ని కలిగించింది.

 

తీన్మార్ మల్లన్న పోలీసులకు ఫిర్యాదు

దాడి అనంతరం తీన్మార్ మల్లన్న మేడిపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడిలో పాల్గొన్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, క్యూ న్యూస్ కార్యాలయానికి భద్రత కల్పించాలన్న డిమాండ్ చేశారు. పోలీసుల తక్షణ స్పందనతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు సమాచారం. అయితే ఈ దాడి వెనుక ఉన్న రాజకీయ కారణాలు, ఉద్రిక్తతకు దారితీసిన ప్రసంగంపై విచారణ అవసరం ఉందని భావిస్తున్నారు.

 

మల్లన్న ఘాటు స్పందన

ఘటనపై స్పందించిన తీన్మార్ మల్లన్న, మీడియా సంస్థలపై.. దాడులు సరికాదని తీన్మార్ మల్లన్న అన్నారు. ప్రశ్నించే గొంతులను అణచివేయాలన్న ప్రయత్నాలు స్వేచ్ఛను కలుషితం చేస్తున్నాయి. రాష్ట్రంలో జాగృతి కార్యకర్తలు, బీఆర్ఎస్ నాయకులు శాంతిభద్రతలకు.. భంగం కలిగిస్తున్నారు అంటూ తీవ్రంగా విమర్శించారు. తనకు ముప్పు ఉన్నందున వెంటనే భద్రతను పెంచాలని ప్రభుత్వాన్ని, పోలీసులను కోరారు.

 

సామాజిక వర్గాల స్పందన

తాజా దాడిని జర్నలిస్ట్ సంఘాలు, పౌర హక్కుల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. మీడియా స్వేచ్ఛ ఒక ప్రజాస్వామ్యానికి మూలాధారం. పాత్రికేయులపై, మీడియా కార్యాలయాలపై దాడులు జరగడం సిగ్గుచేటు. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.