హుజురాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై రాజేంద్ర నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
దీంతో ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో రాజేంద్రనగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి.. కౌశిక్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇక, నిన్న సీఎంపై కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో కౌశిక్ రెడ్డి నివాసానికి ఆయన మద్దతుదారులు, బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు దాడి చేస్తే అడ్డుకునేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ కార్యకర్తలు చెబుతున్నారు. కాగా, ఆయన ఇంటిపై ఏ క్షణమైన దాడి జరిగే అవకాశం ఉందనే సమాచారంతో పోలీసులు మోహరించారు.