సోషల్ మీడియాలో తన పేరుతో వైరల్ అవుతున్న వివాదాస్పద ఆడియో క్లిప్‌పై అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ స్పందించారు. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌ను దూషిస్తున్నట్లుగా ఉన్న ఆ ఆడియోతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తేల్చిచెప్పారు. అది తన గొంతు కాదని, స్థానిక రాజకీయాల్లో తనపై గిట్టనివారే ఇలాంటి దుష్ప్రచారానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.
ఈ వివాదంపై దగ్గుపాటి ప్రసాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. “సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఆడియో రికార్డు నాది కాదు. స్థానిక రాజకీయాల్లో భాగంగా కొందరు నాపై కుట్ర పన్నారు. నాకు చిన్నప్పటి నుంచి నారా, నందమూరి కుటుంబాల పట్ల ఎంతో గౌరవం, అభిమానం ఉన్నాయి,” అని ఆయన వివరించారు.
ఈ ఆడియో వల్ల జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల మనోభావాలు దెబ్బతిని ఉంటే, తన తరఫున మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నానని ఆయన వినమ్రంగా తెలిపారు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని ఆయన కోరారు.