“రాష్ట్ర అభివృద్ధి అనే యజ్ఞాన్ని అడ్డుకునేందుకు కొందరు రాక్షసుల్లా తయారయ్యారు. ప్రతి మంచి పనికీ తప్పుడు ప్రచారాలతో అడ్డంకులు సృష్టిస్తున్నారు. చేతనైతే అభివృద్ధి, సంక్షేమంలో మాతో పోటీ పడాలి తప్ప, ఇలాంటి కుట్ర రాజకీయాలు చేయడం సరికాదు” అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్ష వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దశాబ్దాల కుప్పం ప్రజల కలను సాకారం చేస్తూ, హంద్రీ-నీవా కాలువ ద్వారా కృష్ణా జలాలను నియోజకవర్గానికి తీసుకువచ్చిన చారిత్రక సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాయలసీమకు నీళ్లు వస్తుంటే వైసీపీ నేతలకు ఏమాత్రం జీర్ణం కావడం లేదని, వారిది నాటకాలు ఆడే నైజమైతే, తమది నీళ్లు తెచ్చి ప్రజల దాహార్తి తీర్చే విధానమని ఆయన స్పష్టం చేశారు.
శనివారం కుప్పం నియోజకవర్గంలోని పరమసముద్రం చెరువు వద్దకు చేరుకున్న కృష్ణా జలాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సంప్రదాయ పంచెకట్టులో వేదమంత్రోచ్ఛారణల మధ్య పసుపు, కుంకుమలు సమర్పించి ఘనంగా జలహారతి ఇచ్చారు. అంతకుముందు, తన నివాసం నుంచి మహిళలు, రైతులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. “నన్ను ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి అక్కున చేర్చుకున్న నా కుప్పం ప్రజల రుణం తీర్చుకునే అవకాశం దక్కింది. కుప్పం చివరి భూములకు కృష్ణా జలాలను తీసుకురావడంతో నా జన్మ ధన్యమైంది. నా సంకల్పం నెరవేరింది. 2028లో కృష్ణా పుష్కరాలు వస్తే, కుప్పానికి మాత్రం రెండేళ్లు ముందే పండుగ వచ్చింది” అని ఆనందం వ్యక్తం చేశారు.
వైసీపీ హయాంలో నీటితో డ్రామాలు
దివంగత ఎన్టీఆర్ సంకల్పించిన రాయలసీమ సస్యశ్యామల స్వప్నాన్ని తాము నిజం చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. “సీమలో పశువుల దాహం తీర్చడానికి రైళ్లలో నీళ్లు తెప్పించిన దుస్థితిని నేను చూశాను. అందుకే 1999లోనే హంద్రీ-నీవాకు శ్రీకారం చుట్టాను. 2014-19 మధ్య మా ప్రభుత్వ హయాంలో సీమ సాగునీటి ప్రాజెక్టులపై రూ. 12,441 కోట్లు ఖర్చు చేస్తే, గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం కేవలం రూ. 2 వేల కోట్లు మాత్రమే వెచ్చించి చేతులు దులుపుకుంది. ఎన్నికల ముందు గేట్లకు రంగులేసి, బయటి నుంచి నీళ్లు తెచ్చి వదిలి డ్రామాల ఆడారు. వారు విమానం ఎక్కేలోపే ఆ నీళ్లు ఇంకిపోయాయి. అబద్ధాలు చెప్పడంలో వైసీపీ, అసాధ్యాలను సుసాధ్యం చేయడంలో ఎన్డీఏ దిట్ట” అని ఎద్దేవా చేశారు.
సీమలో కరవును తరిమికొడతాం
నీటి విలువ తెలిసిన పార్టీ తెలుగుదేశం అని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రూ. 3,850 కోట్లు మంజూరు చేసి, కాలువల విస్తరణ పనులు పూర్తి చేసిందని చంద్రబాబు వివరించారు. “నాలుగు నెలల్లోనే 40 టీఎంసీల నీటిని తీసుకొచ్చి, పది రిజర్వాయర్లను నింపాం. దీనివల్ల సీమలోని 6 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందుతుంది. వచ్చే ఏడాదికల్లా చిత్తూరు జిల్లాలోని పీలేరు, పుంగనూరు, చంద్రగిరి వంటి చివరి నియోజకవర్గాలకూ నీరందిస్తాం. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు ద్వారా వంశధార-పెన్నా నదులను అనుసంధానిస్తే రాయలసీమలోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో కరవు అనే మాటే వినిపించదు. ఈ విషయాన్ని తెలంగాణ నేతలు కూడా అర్థం చేసుకోవాలి” అని ఆయన పిలుపునిచ్చారు.
‘రప్పా రప్పా’ రాజకీయాలు కుదరవని, మొన్నటి ఎన్నికల్లో పులివెందుల ప్రజలే దానికి సమాధానం చెప్పారని చురకలంటించారు. ‘స్త్రీ శక్తి’ పథకం వల్ల ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్లను అన్ని విధాలా ఆదుకుంటామని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వారికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. కుప్పంలో హిందాల్కో వంటి 12 పరిశ్రమల రాకతో వేలమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ప్రపంచంలోని అత్యుత్తమ టెక్నాలజీని కుప్పానికి తీసుకొస్తానని హామీ ఇచ్చారు. మెగా డీఎస్సీ, పెన్షన్ల పెంపు, అన్న క్యాంటీన్లు, దీపం పథకం వంటి హామీలను నెరవేరుస్తూ ప్రజారంజక పాలన అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు, చిత్తూరు జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.