National

ట్రంప్ వల్ల అమెరికా పరువు పోతోంది..! యూఎస్ మాజీ అధికారులు ఫైర్..

భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన భారీ సుంకాలపై సొంత దేశంలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ట్రంప్ అనుసరిస్తున్న మొండి విధానాలు అమెరికా బ్రాండ్ ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా, వ్యూహాత్మకంగా కీలకమైన భారత్‌ను చైనాకు దగ్గర చేస్తున్నాయని వైట్‌హౌస్ మాజీ ఉన్నతాధికారి, గతంలో అధ్యక్షుడు జో బైడెన్‌కు జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన జేక్ సలివాన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

 

ఇటీవల ‘ది బల్వార్క్’ అనే పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన సలివాన్, ట్రంప్ విధానాల వల్ల అంతర్జాతీయంగా అమెరికా పలుచనైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. “ఏడాది క్రితం లేనివిధంగా ఇప్పుడు చాలా దేశాల్లో అమెరికా కంటే చైనాయే ప్రజాదరణ పొందుతోంది. అమెరికా బ్రాండ్ ప్రతిష్ఠ మంటగలిసిపోతుండగా, చైనా మరింత బాధ్యతాయుతమైన దేశంగా కనిపిస్తోంది” అని ఆయన వ్యాఖ్యానించారు. ట్రంప్ చర్యల వల్ల మిత్రదేశాలు అమెరికాను నమ్మలేని ఓ పెద్ద ఆటంకంగా చూస్తున్నాయని, అందుకే అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భావిస్తున్నాయని ఆయన తెలిపారు.

 

భారత్‌తో లోతైన, స్థిరమైన సంబంధాన్ని నిర్మించుకోవడానికి తాము ప్రయత్నిస్తే, ట్రంప్ మాత్రం ఆ దేశంపై భారీ వాణిజ్య యుద్ధం ప్రకటించారని సలివాన్ విమర్శించారు. “ఈ పరిస్థితుల్లో, అమెరికాకు ప్రత్యామ్నాయంగా బీజింగ్‌తో చర్చలు జరపాల్సి వస్తుందేమోనని భారత్ ఆలోచించే ప్రమాదం ఉంది” అని ఆయన హెచ్చరించారు.

 

భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అధ్యక్షుడు ట్రంప్ సుంకాలను 50 శాతానికి పెంచిన విషయం తెలిసిందే. అన్యాయమైన వాణిజ్య పద్ధతులు, రష్యా నుంచి ముడి చమురు దిగుమతిని నిలిపివేయకపోవడమే ఇందుకు కారణమని ట్రంప్ ప్రభుత్వం అధికారికంగా చెబుతోంది. అయితే, పాకిస్థాన్‌తో వివాదంలో మధ్యవర్తిత్వం చేస్తానన్న ట్రంప్ ప్రతిపాదనను భారత్ తిరస్కరించినందుకే ఈ సుంకాలను విధించారన్న కథనాలు కూడా వినిపిస్తున్నాయి.

 

ట్రంప్ విధానాలను కేవలం సలివాన్ మాత్రమే కాకుండా, గతంలో అమెరికా ప్రభుత్వంలో పనిచేసిన పలువురు ఉన్నతాధికారులు కూడా తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఒబామా హయాంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన జాన్ కెర్రీ, “గొప్ప దేశాలు బెదిరింపులకు పాల్పడవు, దౌత్యపరంగా ప్రయత్నిస్తాయి” అంటూ గతవారమే ట్రంప్ విధానాలను విమర్శించారు. అదేవిధంగా, ట్రంప్ మాజీ సహాయకుడు జాన్ బోల్టన్ కూడా స్పందిస్తూ, దశాబ్దాలుగా రష్యా, చైనాల నుంచి భారత్‌ను దూరం చేసేందుకు అమెరికా చేసిన ప్రయత్నాలను ట్రంప్ ప్రమాదంలో పడేశారని మండిపడ్డారు.