TELANGANA

వామనరావు దంపతుల హత్య కేసులో కీలక మలుపు.. రంగంలోకి దిగిన సీబీఐ..!

తెలంగాణలో నాలుగేళ్ల క్రితం సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతులు గట్టు వామనరావు, నాగమణి హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారికంగా స్వీకరించింది. ఈ మేరకు ముగ్గురిని నిందితులుగా చేరుస్తూ సీబీఐ అధికారులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

 

సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో వెల్ది వసంతరావు, కుంట శ్రీనివాస్, అక్కపాక కుమార్ పేర్లను నిందితులుగా పేర్కొన్నారు. ఈ సంచలన కేసు దర్యాప్తు అధికారిగా సీబీఐ ఇన్‌స్పెక్టర్ విపిన్ గహలోత్‌ను నియమించారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేసును స్వీకరించిన సీబీఐ, ఇకపై అన్ని కోణాల్లో లోతుగా విచారణ జరపనుంది.

 

2021 ఫిబ్రవరి 17న పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల సమీపంలో హైకోర్టు న్యాయవాదులైన వామనరావు, ఆయన భార్య నాగమణి దంపతులను కొందరు దుండగులు నడిరోడ్డుపై దారుణంగా నరికి హత్య చేశారు. అప్పట్లో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. కేసును విచారించిన రాష్ట్ర పోలీసులు కొందరు నిందితులను అరెస్టు చేశారు.

 

అయితే, రాష్ట్ర పోలీసుల దర్యాప్తుపై అసంతృప్తి వ్యక్తం చేసిన వామనరావు తండ్రి గట్టు కిషన్‌రావు, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, గత నెల ఆగస్టు 12న కేసును సీబీఐకి బదిలీ చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా సీబీఐ రంగప్రవేశం చేయడంతో ఈ కేసు దర్యాప్తు మళ్లీ మొదటికి వచ్చినట్టయింది.