కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తన ఆర్థిక స్థితిగతులపై వస్తున్న విమర్శలకు ఆయన గట్టిగా బదులిచ్చారు. “నాకు డబ్బుకు కొదవలేదు. నా మెదడులో రూ.200 కోట్ల విలువైన ఆలోచనలు ఉన్నాయి. నేను మోసం చేయకుండానే సంపాదిస్తున్నాను” అని ఆయన స్పష్టం చేశారు.
నాగ్‌పూర్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ, తనకు నెలకు రూ.200 కోట్ల ఆదాయం వస్తోందని చెప్పారు. “ఎవరినీ మోసం చేయాల్సిన అవసరం నాకు లేదు. నా వ్యాపారాలు నిజాయితీతో నడుస్తున్నాయి” అని ఆయన నొక్కి చెప్పారు. తన కుమారులు వ్యాపారాల్లో ఉన్నప్పటికీ, తాను వారికి కేవలం సలహాదారుడిగా మాత్రమే ఉన్నానని ఆయన తెలిపారు.
“ఇటీవల నా కుమారుడు ఇరాన్ నుంచి 800 కంటైనర్ల ఆపిల్స్‌ను దిగుమతి చేశాడు. అలాగే 1000 కంటైనర్ల అరటిపళ్లను ఎగుమతి చేశాడు. మా వ్యాపారాలు వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకే. నాకు డబ్బుకు కొదవలేదు” అని ఆయన పేర్కొన్నారు.
ఈ20 ఇంధనంపై వివరణ:
ఈ సందర్భంగా ఈ20 ఇంధనం (20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్)పై వస్తున్న విమర్శలపై గడ్కరీ తీవ్రంగా స్పందించారు. ఈ విధానం వల్ల తన కుటుంబానికి లాభం చేకూరుతోందంటూ వస్తున్న ఆరోపణలు పూర్తిగా అబద్ధమని ఆయన ఖండించారు.
“ఇది పెట్రోల్ లాబీల కుట్ర. రాజకీయంగా నన్ను లక్ష్యంగా చేసుకుని పెయిడ్ సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నారు. సుప్రీంకోర్టు కూడా ఈ20పై దాఖలైన పిల్‌ను తిరస్కరించింది” అని ఆయన గుర్తు చేశారు.
ఈ ఇంధనం సురక్షితమైనదని, ఇది దిగుమతి ప్రత్యామ్నాయంగా, కాలుష్యాన్ని తగ్గించేందుకు, రైతులకు లాభం చేకూర్చే విధంగా రూపొందించామని గడ్కరీ వివరించారు.
పరిశ్రమలు – లాభం కాదు, వ్యవసాయ ప్రోత్సాహమే లక్ష్యం:
ప్రస్తుతం షుగర్ ఫ్యాక్టరీ, డిస్టిల్లరీ, పవర్ ప్లాంట్ లాంటి వ్యాపారాలు నిర్వహిస్తున్నట్టు గడ్కరీ తెలిపారు. కానీ ఇవన్నీ వ్యక్తిగత లాభం కోసం కాకుండా రైతులకు మద్దతుగా నిర్వహిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.