ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ సంరక్షణ కేంద్రాల్లో చోటుచేసుకున్న రెండు వేర్వేరు తీవ్రమైన ఘటనలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. అనంతపురంలోని ప్రభుత్వ శిశుగృహంలో ఏడాదిన్నర బాలుడు మృతి చెందడం, పార్వతీపురం మన్యం జిల్లాలోని గురుకుల పాఠశాలలో 85 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురవ్వడంపై ఆయన ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఆయన గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి జి. సంధ్యారాణితో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
అనంతపురం శిశుగృహంలో జరిగిన బాలుడి మృతి ఘటన తీవ్ర కలకలం రేపింది. సిబ్బంది మధ్య ఉన్న వివాదాల కారణంగానే పసికందుకు సరిగా ఆహారం అందించడంలో నిర్లక్ష్యం వహించారని, అదే చిన్నారి మృతికి దారితీసిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా, ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని హడావుడిగా ఖననం చేశారన్న విమర్శలు కూడా వెల్లువెత్తాయి. కళ్యాణదుర్గానికి చెందిన ఓ మహిళ ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన బిడ్డను సెప్టెంబర్ 30న శిశుగృహంలో చేర్పించారు. పుట్టుకతోనే తక్కువ బరువుతో ఉన్న ఆ చిన్నారి, దసరా రోజు (అక్టోబర్ 2న) విరేచనాలతో మృతి చెందాడు.
అనంతపురం ఘటనపై జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ విచారణకు ఆదేశించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ ఈబీ దేవి, ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం. నాగమణి, ప్రభుత్వ ఆసుపత్రి పీడియాట్రిక్ హెచ్ఓడీలతో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సమగ్ర నివేదిక సమర్పించాక బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. శిశుగృహం మేనేజర్‌తో పాటు ఆయాలకు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అధికారి మెమోలు జారీ చేశారు.