TELANGANA

చాదర్‌ఘాట్‌లో కాల్పుల కలకలం: చైన్ స్నాచర్‌పై డీసీపీ ఫైరింగ్

హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ పరిధిలో తాజాగా కాల్పుల ఘటన ప్రజలను షాక్‌కు గురి చేసింది. సీపీ కార్యాలయంలో మీటింగ్‌కు వెళ్లి వస్తుండగా, సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య ఇద్దరు చైన్ స్నాచర్లను గమనించి, తన గన్ మెన్‌తో కలిసి వారిని వెంబడించారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.

ఈ క్రమంలో ఒక చైన్ స్నాచర్ కత్తితో డీసీపీపై దాడికి యత్నించగా, డీసీపీ కిందపడిపోయారు. వెంటనే తేరుకున్న డీసీపీ అప్రమత్తమై, చైన్ స్నాచర్‌పై తన గన్‌తో మూడు రౌండ్ల కాల్పులు జరిపారు. కాల్పులు జరపడంతో ఇద్దరు దొంగలు కింద పడిపోయారు.

వెంటనే పోలీసులు మరియు స్థానికుల సహాయంతో ఇద్దరు చైన్ స్నాచర్లను అదుపులోకి తీసుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఒక చైన్ స్నాచర్‌ను పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ప్రస్తుతం హైదరాబాద్‌లో తీవ్ర కలకలంగా మారింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.