AP

అవినీతి ఆరోపణలు: ఏపీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ మెరుపు దాడులు

ఆంధ్రప్రదేశ్‌లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి పెరిగిపోతుందనే తీవ్ర ఫిర్యాదుల నేపథ్యంలో, ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా అవినీతి నిరోధక బ్యూరో (ACB) అధికారులు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. అటెండర్ మొదలుకుని సూపరింటెండెంట్ వరకు డబ్బు ఇవ్వనిదే ఫైలు కదలడం లేదని, మొహం మీదే లంచం అడుగుతున్నారని ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీనిపై అందిన ఫిర్యాదుల ఆధారంగానే ఏసీబీ అధికారులు ఈ భారీ ఆపరేషన్ చేపట్టారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఏకకాలంలో ఏకంగా 120 ఆఫీసులపై ఏసీబీ దాడులు జరుపుతోంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, ప్రకాశం జిల్లా ఒంగోలు, విజయనగరం జిల్లా భోగాపురం, సత్యసాయి జిల్లా చలమత్తూరు, పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటతో సహా పలు ప్రాంతాల్లో ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఆయా కార్యాలయాల్లో అధికారులు రికార్డులను తనిఖీ చేస్తున్నారు.

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భారీ ఎత్తున లావాదేవీలు జరుగుతున్నా అవి రికార్డుల్లోకి రావడం లేదనే ఫిర్యాదులు ఎప్పటి నుంచో ఉన్నాయి. కొన్ని చోట్ల డబ్బు కోసం రికార్డులను మారుస్తున్న ఘటనలపైనా ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏసీబీ దాడులకు ఆదేశాలు ఇవ్వడంతో, అధికారులు పలుచోట్ల దాడులు జరిపి కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంటున్నారు.