AP

పల్లె రోడ్ల సమాచారం ప్రజల చేతిలో: ‘పల్లె పండగ 2.0’పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల పనులపై సమీక్ష నిర్వహించి, కీలక ప్రకటనలు చేశారు. పల్లె ప్రజలకు నాణ్యతతో కూడిన స్వచ్ఛమైన తాగునీరు మరియు గుంతలు లేని రహదారులు అందుబాటులో ఉంచాలనేది తన ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి, పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో త్వరలో సరికొత్త సాంకేతికతను ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ‘జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టం’ ద్వారా గ్రామీణ రోడ్ల పూర్తి సమాచారాన్ని ప్రజలందరూ తెలుసుకునే వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించారు.

పవన్ కళ్యాణ్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ, పల్లె రోడ్ల సమాచారం ప్రజల చేతిలో అందుబాటులో ఉండాలని, “మనం ప్రయాణం చేసే మార్గంలో రోడ్డు ఉందా? లేదా? ఉంటే ఎలా ఉంది?” అనే వివరాలు ప్రతి ఒక్కరికీ తెలియాలని అన్నారు. క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకొని, రహదారులను మెరుగుపరచుకునేలా ఈ సాంకేతికత ఉండాలని, దీనికి సంబంధించిన స్పష్టమైన యాక్షన్ ప్లాన్‌ను 48 గంటల్లో సిద్ధం చేయాలని ఆదేశించారు. దీంతోపాటు, నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ పనుల్లో ఆశించిన పురోగతి లేకపోవడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

అంతేకాకుండా, ‘సాస్కీ’ నిధుల సాయంతో ‘పల్లె పండగ 2.0’ ని వెంటనే పట్టాలెక్కించేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. రూ.2,123 కోట్ల సాస్కీ నిధులతో పల్లెల్లో 4007 కిలోమీటర్ల మేర రహదారులు, గోకులాలు, మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయన్నారు. మరోవైపు, గిరిజన గ్రామాల్లో చేపట్టిన ‘అడవి తల్లిబాట’ పనులను వేగవంతం చేయాలని, ‘స్వమిత్వ పథకం’ ద్వారా వచ్చే మార్చి నాటికి రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికి ప్రాపర్టీ కార్డులు అందజేసే విధంగా ముందుకు వెళ్లాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.