టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) గాయంపై బీసీసీఐ (BCCI) నుంచి శుభవార్త వెలువడింది. సౌతాఫ్రికాతో తొలి టెస్టులో మెడ నొప్పితో మైదానాన్ని వీడిన గిల్, ప్రస్తుతం కోలుకుంటున్నాడని, భారత జట్టుతో కలిసి గువాహటికి ప్రయాణించనున్నాడని బోర్డు తెలిపింది. గిల్ పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ, అతడు రెండో టెస్టులో ఆడతాడా లేదా అనే తుది నిర్ణయం మాత్రం మ్యాచ్‌కు ముందు మాత్రమే తీసుకోనున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది. గిల్ ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు.
తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కేవలం 3 బంతులు ఆడిన తర్వాత షాట్ ఆడుతుండగా గిల్‌కు మెడలో నొప్పి రావడంతో మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అతను రెండో ఇన్నింగ్స్‌లో కూడా బ్యాటింగ్ చేయడానికి రాలేకపోవడం టీమ్ ఇండియాపై ప్రభావం చూపింది. అయితే, వైద్య నివేదిక ప్రకారం గిల్ గాయం తీవ్రమైనది కాదని, కేవలం స్వల్పమైన ఒత్తిడి మాత్రమే అని తెలుస్తోంది. ముందు జాగ్రత్తగా గిల్ ప్రస్తుతం మెడకు నెక్ కాలర్ ధరించాలని వైద్యులు సలహా ఇచ్చారు.
గిల్ ప్రస్తుత ఫామ్ టెస్ట్ ఫార్మాట్‌లో అద్భుతంగా ఉంది. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో పరుగుల వరద పారించిన గిల్, ఆ తర్వాత వెస్టిండీస్‌పై కూడా సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో సౌతాఫ్రికాతో జరిగే రెండో టెస్టులో గిల్ ఆడేందుకు ఫిట్‌గా మారాలని భారత జట్టు యాజమాన్యం, అభిమానులు ఆశిస్తున్నారు.

