TELANGANA

స్థానిక సంస్థల ఎన్నికలు: బీఆర్ఎస్‌కు ‘బావ-బామ్మర్దుల’ సారథ్యం సవాలేనా?

తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి ఒక పెద్ద సవాల్‌గా మారనున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాలకు ధీటుగా బలంగా వెళ్లాలంటే, ప్రస్తుతం పార్టీ సారథ్యం వహిస్తున్న కేటీఆర్ నాయకత్వం సరిపోదన్న అభిప్రాయం పార్టీలో బలంగా వినిపిస్తోంది. అనారోగ్య కారణాల వల్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికీ ఫామ్‌హౌస్‌కే పరిమితం కావడం, ఆయన ఎన్నికల ప్రచారానికి కూడా దూరంగా ఉండే అవకాశాలు ఉండటంతో, ఈ కీలకమైన స్థానిక ఎన్నికలను కూడా ప్రధానంగా కేటీఆర్, హరీశ్ రావు (బావ-బామ్మర్దులు) నేతృత్వంలోనే ఎదుర్కోవాల్సి ఉంది.

గత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ నేతల్లో కొంత నిరాశ నెలకొంది. కేసీఆర్ నాయకత్వంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన పార్టీ, కేటీఆర్ సారథ్యంలో పార్లమెంటు ఎన్నికలు, ఉప ఎన్నికల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చిందన్న భావన కార్యకర్తల్లో ఉంది. ప్రస్తుతం కేటీఆర్, హరీశ్ రావు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు కూడా జనంలోకి పెద్దగా వెళ్లడం లేదని, క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను సిద్ధం చేయడంలో కూడా వీరిద్దరూ విఫలమవుతున్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. కేసీఆర్ నామమాత్రంగా మారిపోవడంతో పార్టీ భవిష్యత్తుపై కార్యకర్తల్లో భయం నెలకొంది.

ఈ పరిణామాల మధ్య, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత హరీశ్ రావును టార్గెట్ చేస్తూ, నాయకత్వంపై ఘాటైన విమర్శలు చేయడం రాజకీయంగా బీఆర్ఎస్‌కు మరింత ఇబ్బందికరంగా మారింది. జిల్లాల పర్యటనలతో పాటు సూటిగా ప్రశ్నలు సంధిస్తున్న కవిత కారణంగా, ఇప్పుడు అధికార పార్టీ విమర్శలకు సమాధానం చెప్పేకంటే, కవిత వేస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాల్సిన దుస్థితిని బీఆర్ఎస్ నాయకత్వం ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో, స్థానిక నాయకత్వం కొంత యాక్టివ్‌గా ఉన్నప్పటికీ, రేవంత్ రెడ్డి వ్యూహాల ముందు కేటీఆర్, హరీశ్ రావులు తేలిపోతారేమోనన్న బెంగ బీఆర్ఎస్ శ్రేణుల్లో పట్టుకుంది.